సీత కోసం స్టార్ హీరోయిన్... తల్లి అయ్యాకే షూటింగ్....!
ఆదిపురుష్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా అని జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన డార్లింగ్ ప్రభాస్ మూవీ కావడం ఓ విశేషమైతే, ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా స్టార్ క్యాస్ట్ మరో విశేషంగా మారబోతోంది.

కీర్తీ, కియారా... సైడ్ ప్లీజ్
సినిమాలో ప్రతి పాత్ర కోసం ఇండస్ట్రీని కాచి వడబోస్తున్న దర్శకుడు ఓం రౌత్, రాముడిగా ప్రభాస్ ను, లంకేశుడిగా సైఫ్ అలీఖాన్ ను సునాయాశంగానే రంగంలోకి దించేశాడు. అయితే, సీత విషయంలోనే మనోడు కాస్త ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి సురేశ్ , కియారా అద్వానీ పేర్లు ఇండస్ట్రీలో మారుమోగాయి. అయితే వీరిని పక్కన పెట్టి త్వరలో అమ్మగా మారబోతున్న ఓ నాజూకుభామను రంగంలోకి దించేందుకు స్కెచ్ వేస్తున్నాడు.

ఈడూజోడూ కుదిరింది...
కీర్తి సురేశ్, కియారా అద్వాని పేర్లుకు పెద్దగా స్పందన రాకపోవడంతో మరో స్టార్ హీరోయిన్ కు కథ వినిపించాడట ఓం రౌత్. లాంగ్ లెగ్స్ బ్యూటీ అనుష్కా శర్మ అయితే ప్రభాస్ కు ఈడూ జోడూ బాగా కుదరడంతో పాటూ, అమ్మడి స్టార్ డమ్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. ఇక అనుష్కకు కథ వినిపించగానే ఆమె కూడా చాలానే ఎగ్జైట్ అయిందట.

అమ్మ అయ్యాకే షూటింగ్...
ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అనుష్క తాను తల్లి కాబోతున్న వార్తను ప్రపంచానికి తెలియజేసిన సంగతి తెలిసిందే. 2021, జనవరిలో ప్రసవం కానుందని వెల్లడించింది. మరోవైపు ఓం రౌత్ కూడా జనవరి నుంచే షూటింగ్ ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నాడు. అయితే, అప్పటికీ అనుష్కకు కుదరదు కాబట్టి, ఆమె లేని సీన్స్ ను తొలుత చిత్రీకరించనున్నారట.

జనవరి నుంచి షూటింగ్..
ఓం రౌత్ కథ చెప్పిన వైనానికి ఫిదా అయిపోయిన అనుష్క సైతం ఇందుకు అంగీకారం తెలిపిందని వినికిడి. అతడి విజన్ పై గురి కుదరడంతో సీతగా కనిపించేందుకు సై అందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అనుష్క సైతం సినిమాకు సంతకాలు చేస్తే కానీ, ఎదీ కన్ఫామ్ కానట్లే. ఇకపోతే, తొలుత ప్రభాస్, సైఫ్ అలీఖాన్ లపై చిత్రీకరణ మొదలవ్వనుందని తెలుస్తోంది.

సీతగా సెట్ అయ్యేనా...!
ఏమైనా ఆదిపురుష్ లో అనుష్క శర్మ ప్లేస్ కన్ఫామ్ అయితే, స్టార్ క్యాస్ట్ నిజంగానే అదిరిపోయిందని చెప్పుకోవాలి. చిత్ర యూనిట్ సైతం ఆమెకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. మరి అనుష్క, సీతగా సెట్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











