మానవత్వమే లేదే.. డబ్బు, పార్టీలే లోకమా? రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సినిమాలు చేసినా చేయకున్నా ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటారు. పవన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా రేణూ దేశాయ్‌ని తెరపైకి తీసుకొస్తారు పవర్‌స్టార్ అభిమానులు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రేణు .. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటారు. ఎవరు ఏమనుకున్నా ఏ విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడటం రేణుకి అలవాటు. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పవర్‌ఫుల్ స్టోరీ రాసుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్‌లు ఇప్పటికీ ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటారు. కొందరు పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓవరాక్షన్‌తో వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటారు. ఇటీవల అకీరా నందన్‌పై నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ఓ వ్యక్తిపై రేణూ దేశాయ్ విరుచుకుపడ్డారు. నా గురించి చెత్త వాగుడు వాగినా భరిస్తాను కానీ నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం ఊరుకోనని రేణూ దేశాయ్ హెచ్చరించారు.

ఇటీవల కోల్‌కతాలోని ఆర్జీ కార్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై రేణు దేశాయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమ్మాయిలు తనను తాను రక్షించుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ , ఇతర ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని సూచించారు. తన కుమార్తెకు బొక్కలు విరగ్గొట్టడం నేర్పిస్తున్నానని రేణూ పోస్ట్ చేశారు.
పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు. అలాగే పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా పోరాడుతున్నారు. తనకు తోచినంత సాయం చేయడంతో పాటు , ప్రజలను కూడా విరాళాలు కోరుతూ శ్రమిస్తున్నారు. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తుంటారు. ఇటీవల ఓ పెట్‌కు సర్జరీ కోసం ఆమె విరాళాలు కావాలని కోరగా కేవలం పది మంది మాత్రమే ముందుకు రావడంతో రేణూ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు దాదాపు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని కానీ ఇలాంటి రియాక్షన్ ఊహించలేదన్నారు. అలాగే విజయవాడలో చోటు చేసుకున్న వరదల్లో చిక్కుకున్న పెట్స్‌ను కాపాడాలని కోరారు. ఓ వ్యక్తి కుక్కను చిత్రహింసలు పెడుతుండటంతో ఆ వివరాలను షేర్ చేసి ఇలాంటి తప్పులు చేస్తే అరెస్ట్ అవుతారని హెచ్చరించారు. దానికి కొనసాగింపుగా రేణు దేశాయ్ మరో పోస్ట్ పెట్టారు.
భూమ్మీద మనతో పాటు జీవించే జంతుజాలాన్ని ఎలా గౌరవించాలో , ఎలా ప్రేమించాలో నేర్చుకోవాలని సూచించారు. మనుషులు స్వార్ధంగా మారుతున్నారని.. వారి చుట్టూ ఉన్న ప్రతిదానిని నాశనం చేస్తున్నారని, కేవలం డబ్బు సంపాదించడం, డిజైనర్ దుస్తుల్లో పార్టీలకు వెళ్లడం ఒక్కటే విజయానికి కొలమానం కాదని రేణూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రేణు దేశాయ్ మంచి మనసు, మూగజీవాలపై ఆమె ప్రేమను ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











