Renu Desai : నెరవేరిన ఏళ్ల నాటి కల .. ఇకపై సొంతంగానే , రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్
సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నిత్యం వార్తల్లో ఉంటారు. సమకాలీన అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రేణు దేశాయ్ ఏం పెట్టారు? ఎవరి గురించి ప్రస్తావించారు? ఆ వీడియోలో మాట్లాడుతూ రేణూ దేశాయ్ ఎందుకు ఎమోషనల్ అయ్యారు? ఈ వివరాల్లోకి వెళితే :
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యాలే ప్రపంచంగా బతుకుతున్నారు రేణు దేశాయ్. వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. అకీరాను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలని తెర వెనుక ప్రయత్నాలు జరుగుతుండగా.. రేణూదే తుది నిర్ణయమని ఫిలింనగర్ టాక్. మ్యూజిక్ పైనా అకీరాకు టచ్ ఉండటంతో ఆ వైపు కూడా ఓ లుక్కేసే అవకాశాలు లేకపోలేదు.

సినిమాలతో పాటు పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలిగా సేవలందిస్తున్నారు రేణు దేశాయ్. తన స్తోమతకు తగిన విధంగా సాయం చేయడంతో పాటు , సమాజానికి అవగాహన కల్పిస్తుంటారు రేణు. ముఖ్యంగా మూగజీవాలతో గడపటం , వాటి ఆలనా పాలనా చూడటం ఆమెకు ఎంతో ఇష్టం. అలాగే వాటికి ఏ కష్టం కలిగినా ఆమె చలించిపోతారు. ఇటీవల విజయవాడలో వరదల సందర్భంగా నీటిలో చిక్కుకున్న పెట్స్‌ను కాపాడాలని స్వయంగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను కోరారు.
మనుషులు స్వార్ధంగా మారుతున్నారని.. వారి చుట్టూ ఉన్న ప్రతిదానిని నాశనం చేస్తున్నారని, కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే విజయానికి కొలమానం కాదంటూ రేణూ దేశాయ్ విరుచుకుపడ్డారు. ప్రతి మాసంలోనూ వచ్చే పండుగలు, విశిష్ట దినాలను ఘనంగా జరుపుకుంటారు రేణు దేశాయ్ . కొద్దిరోజుల క్రితం శరద్ పౌర్ణమి సందర్భంగా ఆమె తన నివాసంలో గణపతి చండీ హోమం నిర్వహించారు. భారతీయ సంస్కృతిలో శరద్ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉందని.. పెద్దలు అనుసరించిన విధానాలను పిల్లకు నేర్పించాలని ఆమె కోరారు. ఈ చండీ హోమంలో తల్లితో పాటు అకీరా నందన్ కూడా పాల్గొన్నారు.
తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ రోజు చాలా సంతోషంగా ఉందని , జీవితంలో ఈరోజును ఎప్పుడూ మరిచిపోనని చెప్పారు. మూగ జీవాలను రక్షించేందుకు వ్యక్తిగతంగా ఎంతో ప్రయత్నించానని రేణు తెలిపారు. వాటి సంక్షేమం కోసం తన వాణిని బలంగా వినిపించాలని అనుకున్నానని ఆమె చెప్పారు. సొంతంగా ఎన్జీవో స్థాపించాలని ఏళ్లుగా కలలు గంటున్నానని, ఇన్నాళ్లకు తన లక్ష్యం నెరవేరిందని రేణు చెప్పారు. ఈ రోజు సొంతంగా ఎన్జీవోను రిజిస్టర్ చేయించానని ఆమె స్పష్టం చేశారు. ఆర్ధిక సాయం చేయాలని అనుకునేవారు ముందుకు రావాలని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











