రేణు దేశాయ్ రెండో పెళ్లి.. ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. విడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ - రేణూ దేశాయ్ మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశారు. తన సినిమాలు, సోషల్ సర్వీస్‌తో పాటు సమాజంలో నిత్యం జరుగుతున్న అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ఆవిడ రెండో పెళ్లి గురించి తరచుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా దానిపై స్పందించారు రేణు దేశాయ్.
పవన్‌తో డేటింగ్, పెళ్లి
రేణు దేశాయ్- పవన్ కళ్యాణ్‌లకు తొలుత బద్రీ సినిమా సమయంలో తొలిసారి కలుసుకున్నారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. సుదీర్ఘ డేటింగ్ తర్వాత 2009లో వీరు పెళ్లితో ఒక్కటయ్యారు. వీరికి అకీరా నందన్, ఆద్య సంతానం. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2012లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. పవన్, రేణు మధ్య విడాకులకు దారి తీసిన కారణాలు ఏంటనేది నేటికీ తెలియదు. కానీ ఎవరికి నచ్చిన విధంగా వారు కథలు అల్లేసుకుంటారు.

సినిమాలకు దూరమైన రేణు
రేణు దేశాయ్‌ని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ భార్యగానే చూస్తున్నారు ఆయన అభిమానులు. ఆవిడ గురించి ఇప్పటికీ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. వారి టార్చర్ హద్దులు దాటడంతో పలుమార్లు ఆమె వార్నింగ్ కూడా ఇచ్చారు రేణూ దేశాయ్. ఆద్య, అకీరాల గురించి సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరిగినా వెంటనే రియాక్ట్ అవుతారు. ఈ దెబ్బకు రేణును టార్గెట్ చేయడం ఆపేశారు నెటిజన్లు. జానీ తర్వాత పవన్‌తో పెళ్లి కావడం, వెంటనే పిల్లలు పుట్టడం, విడాకులతో సినిమాలకు దూరమయ్యారు రేణు దేశాయ్. దాదాపు 20 ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో హేమలత లవణం అనే పాత్రలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ కాగా.. మరే సినిమాకు రేణు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
సామాజిక సేవలో బిజీ
జంతు ప్రేమికురాలిగా మూగ జీవాల సంక్షేమం, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రేణు దేశాయ్. ఎక్కడ ఏ మూగ జీవానికి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందిస్తారు. తను వ్యక్తిగతంగా సాయం చేయడంతో పాటు విరాళాలు సేకరించి వాటి శ్రేయస్సు కోసం వినియోగిస్తుంటారు. గతేడాది ఆమె స్థాపించిన ఎన్జీవో సంస్థకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో ఎంతో సంబరపడిపోయారు రేణు. ఆ సంస్థకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అంబులెన్స్‌ను సమకూర్చారు.
పిల్లల కోసం ఒంటరిగా
పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలే లోకంగా బతుకుతున్నారు రేణు దేశాయ్.. వారికి చదువు, సంస్కారంతో పాటు పౌరుడిగా అన్ని బాధ్యతలు నేర్పించారు. ఈ క్రమంలోనే పలుమార్లు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా, ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. వాటికి ఆమె చెక్ పెడుతూ వచ్చారు. తనకు కూడా ఓ భాగస్వామి ఉంటే బాగుండు అనిపిస్తుందని.. కానీ నా పిల్లలపై ఉన్న బాధ్యత కారణంగానే తోడుగా ఉంటున్నానని పలు ఇంటర్వ్యూలలో రేణు దేశాయ్ చెప్పారు.
రెండో పెళ్లికి రెడీ
తాజాగా తన రెండో పెళ్లిపై స్పందించారు రేణు దేశాయ్. రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటానని.. కుటుంబం నుంచి ఈ విషయంపై ఒత్తిడి వచ్చినా పిల్లల కోసం వద్దు అనుకున్నానని అన్నారు. ఇప్పుడు అకీరా, ఆద్య కూడా తనను పెళ్లి చేసుకోమని చెబుతున్నారని .. నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్లని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నారని రేణు తెలిపారు. అయితే కొంతకాలం తర్వాతే నాకు స్వేచ్ఛ లభిస్తుందని.. అప్పుడే పెళ్లిపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని రేణు చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రేణు దేశాయ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? కాబోయే భర్త ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











