‘సుశాంత్ లాగే నన్నూ చంపేస్తారు.. నా హత్యకు కుట్ర ఇలా’
బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా రోజుకొక వీడియోతో కలకలం రేపుతున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారని వాపోతోంది. పోలీసులకు ఫిర్యాదులు చేసి విసిగిపోయానని ఇక తనకు ఓపిక లేదని, తనను చంపేస్తారని సంచలన ఆరోపణలు చేస్తోంది. బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ తనను టార్గెట్ చేసిందని, వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని చెబుతోంది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
డిప్రెషన్‌లోకి
2005లో ఆషిక్ బనాయా అపనే సినిమాతో దేశాన్ని ఊపేసింది తనుశ్రీ దత్తా. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో కలిసి బెడ్‌రూం సన్నివేశాల్లో రెచ్చిపోయింది. అదే సంవత్సరం తెలుగులో నందమూరి బాలకృష్ణతో వీరభద్ర సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టింది తనుశ్రీ దత్తా. అక్కడ పడుతూ లేస్తూ కెరీర్ సాగుతుండగా 2013 తర్వాత వెండితెరకు పూర్తిగా దూరమైంది. మానసికంగా కుంగిపోవడంతో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసిన తనుశ్రీ దత్తా.. లడఖ్‌లోని బౌద్ధ ఆశ్రమాలను సందర్శిస్తూ ధ్యానంలో మునిగిపోయింది.

మీటూకి నాంది పలికిన తనుశ్రీ
2018లో దేశంలో ఉద్ధృతంగా సాగిన మీటూ ఉద్యమానికి నాంది పలికింది తనుశ్రీ దత్తాయే. బాలీవుడ్ నటుడు తనను తైంగిక వేధించారని.. అలాగే నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బలంతం చేశాడని చేసిన ఆరోపణలు భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. కొద్దిరోజులు ఈ వ్యవహారం బాలీవువడ్‌ను కుదిపేయగా.. తర్వాత పరిస్ధితులు చక్కబడ్డాయి. అయినప్పటికీ అప్పుడప్పుడు తను ఎదుర్కొన్న ఇబ్బందులను పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు తనుశ్రీ దత్తా.
నా ఇంట్లోనే వేధిస్తున్నారు
తాజాగా రెండ్రోజుల క్రితం ఏడుస్తూ ఓ వీడియో పెట్టిన తనుశ్రీ.. సొంతింటిలోనే తాను వేధింపులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తాను క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నానని.. నా పనులు నేనే చేసుకోలేకపోతున్నానని పేర్కొంది. తన ఇంటిపైన, ఇంటి బయట పెద్ద పెద్ద శబ్ధాలు వినిపిస్తున్నాయని.. నా ఇంటిలోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తనకు సాయం చేయాలని తనుశ్రీ దత్తా అభ్యర్ధించింది. ఈ ఘటన తర్వాత వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.
నా హత్యకు కుట్ర
ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనుశ్రీ దత్తా మరిన్ని సంచలనాలు బయటపెట్టారు. బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ చాలా బలమైనదని.. తాను నిజాలు బయటపెడితే తన ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదిరిగానే నన్ను కూడా చంపేస్తారని తనుశ్రీ బాంబు పేల్చింది. మీటూ ఉద్యమం తర్వాతి నుంచి నా చుట్టూ ఉన్న పరిస్ధితులు భయానకంగా మారిపోయాయని తెలిపింది. దానిని అర్ధం చేసుకోవడానికి నాకు సమయం పట్టిందని, నా కారు బ్రేక్‌లు ఫెయిలయ్యాయని.. భోజనంలో విషం కలపడానికి కూడా ప్రయత్నాలు జరిగాయని తనుశ్రీ చెప్పింది. ఉన్న స్నేహితులు కూడా ఒక్కొక్కరిగా దూరమయ్యారని వాపోయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై హిందీ సినిమా వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











