మహానటి సావిత్రి దురదృష్టం అలా.. బీ సరోజాదేవికి అదృష్టం ఇలా!
సినిమా పరిశ్రమలో ప్రముఖుల వరుస మరణాలు సినీ రంగాన్ని, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఆదివారం రోజు హైదరాబాద్‌లో ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మరణాన్ని ఇంకా మరిచిపోకముందే... లెజెండరీ హీరోయిన్ బీ సరోజ దేవీ మృతివార్త మరింత విషాదంలోకి నెట్టింది. ఆమె మరణ వార్తతో సినీ అభిమానులు మూగబోయారు. అయితే ఆమె మరణం సమయంలో లెజెండరీ నటి సావిత్రితో ముడిపడి ఉన్న కొన్ని విషయాలు చర్చకు వచ్చాయి. వివాదాస్పదంగా మారిన కొన్ని విషయాల వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నటి బీ సరోజా దేవీ తన 17 ఏటనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. కన్నడ నాట నటిగా అడుగుపెట్టి కొద్ది సమయంలోనే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మేటి లేని నటిగా, స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. వరుస చిత్రాలతో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు. ఆ సమయంలో అత్యధిక పారితోషికం అందుకొన్న హీరోయిన్‌గా మారిపోయారు. అయితే ప్రొఫెషనల్ పరంగా బిజీగా ఉండటంతో తన సంపాదనకు సంబంధించిన పన్ను చెల్లింపు విషయంలో ఐటీ అధికారుల దృష్టిలో పడటం ఆమెను ఆర్థిక సమస్యల్లో పడేసింది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటారు.

పన్ను చెల్లింపులో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలపై బీ సరోజాకు ఇన్‌కమ్ టాక్స్ ఆధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ సమయంలో ఆమె సందిగ్దంలో పడింది. తన వర్క్, టూర్లు, షూటింగ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా చట్టపరంగా పాటించాల్సిన కొన్ని రూల్స్ పాటించకపోవడం వల్ల ఐటీ అధికారులు కొరఢా ఝళిపించారు. అయితే ఆ సమయంలో భారత్ ఎలక్ట్రానిక్స్‌లో అధికారిగా పనిచేసే ఆమె భర్త అండగా నిలిచారు. ఆమెకు ఎదురైన సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకొన్నారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలో అనే విషయాన్ని ఆ సంఘటన నేపథ్యంలో భర్త నుంచి నేర్చుకొన్నారు. తన భర్తే సహకారం లేకపోతే తాను మరింత చిక్కుల్లో పడాల్సి వచ్చేదని ఆమె స్వయంగా తన సన్నిహితులతో చెప్పుకొన్నారట.
అయితే సావిత్రి జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తనకు చేదోడువాదోడుగా పక్కన ఉండే మేనేజర్ తప్పుదోవ పట్టించడంతో చట్టపరంగా, న్యాయపరంగా సమస్యలను ఎదుర్కొన్నారు. ఐటీ అధికారులు దాడులు, నోటీసులు, కేసులన్నీ ఆమెను చుట్టుముట్టాయి. అప్పటికే ఆమె కెరీర్ పరంగా, దాంపత్య జీవితం పరంగా చిక్కుల్లో కూరుకుపోవడంతో ఐటీ అధికారుల నమోదు చేసిన కేసుల్లో అండగా నిలిచే వారు లేకపోవడం, ఆమెను సరైన మార్గంలో నడిపించే వారు లేకపోవడం వల్ల ఆమె మరింత కష్టాల్లో కూరుకుపోయారని దిగ్గజ నటిని దగ్గరగా చూసిన వారు చెప్పుకొంటారు.
ఐటీ నిబంధనల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాలను మేనేజ్ చేయలేకపోవడం వల్ల ఐటీ అధికారులు ఆమె ఆస్తులను జప్తు చేశారు. దాంతో తన ఆస్తులన్నీ చేజారడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. ఆ సమయంలో డబ్బు కోసం తన ముందుకు వచ్చిన సినిమాలను చేసి తన పాపులారిటీ మసకబారేలా చేసుకొన్నారు. దాంతో ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఆ సమయంలో తన భర్త జెమినీ గణేషన్ కొంత అండగా నిలిచేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారి మధ్య వైవాహిక విభేదాల కారణంగా సఫలం కాలేదు. దాంతో ఆర్థిక సమస్యలతో ఆమె చివరి క్షణాలు దుర్భరంగా గడిచాయని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.
మహా నటి సావిత్రిని తాను నమ్మిన వాళ్లే మోసం చేయడం వల్ల గొప్పగా సాగిన జీవితం అత్యంత బాధాకరంగా ముగిసింది. ఆ సమయంలో భార్యభర్తల మధ్య సయోధ్య కలిగి ఉంటే.. ఆమె జీవితం మరోలా ఉండేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతాయి. బీ సరోజా దేవీ విషయంలో అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కష్టకాలంలో భర్త అండగా నిలువడంతో ఆర్థిక సమస్యలు, ఐటీ నోటీసులు, కేసుల నుంచి తేలికగా బయటపడ్డారని కన్నడ వర్గాలు చెప్పుకొంటాయి.


Click it and Unblock the Notifications











