Kingdomపైనే భాగ్యశ్రీ బోర్సే ఆశలు.. శ్రీలీల కుర్చీపై మిస్టర్ బచ్చన్ భామ గురి
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించారు. కింగ్డమ్‌లో సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరికీ అత్యంత కీలకం. హీరో విజయ దేవరకొండ చివరిగా నటించిన లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. కెరీర్ పరంగా ఆయన తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రేసులో నిలవాలంటే ఖచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో కింగ్డమ్ కోసం సర్వశక్తులు ఒడ్డారు. నటన, లుక్, యాక్షన్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

ఫ్లాప్‌తో కెరీర్ మొదలెట్టిన భాగ్యశ్రీ
ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. తొలి సినిమా ఫ్లాప్ అయితే హీరోలు ఎలాగోలా నెట్టుకు రాగలరు.. కానీ హీరోయిన్లకు మాత్రం అవకాశాలు దక్కడం కష్టమే. అయితే మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందాలతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోయారు. దీంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. ఈ క్రమంలోనే కింగ్‌డమ్‌లోనూ అవకాశం దక్కింది. రామ్ పోతినేనితో ఆంధ్రా కింగ్ తాలూకాలోనూ భాగ్యశ్రీ నటిస్తున్నారు.
పూజాతో పోలస్తున్న నిపుణులు
తన కెరీర్ ట్రాక్‌లో పడాలన్నా.. మరిన్ని అవకాశాలు దక్కాలన్నా కింగ్డమ్ హిట్ కావడం తప్పనిసరి. అందుకే భాగ్యశ్రీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు మీడియాను ఫేస్ చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మరికొందరైతే భాగ్యశ్రీని పూజా హెగ్డే, శృతిహాసన్ తదితర స్టార్ హీరోయిన్లతో పోలుస్తున్నారు. వీరిద్దరూ కూడా తొలి చిత్రంతో పాటు వరుసగా ఫ్లాప్స్ ఇచ్చి ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్నారు. అయితే ఒక్క హిట్ పడగానే శృతి, పూజాల కెరీర్ మారిపోయింది. అలాగే భాగ్యశ్రీ కూడా ఫ్లాప్‌తో కెరీర్ ప్రారంభించినా.. అందం, అదృష్టం ఈమెకు బాగానే కలిసొస్తుందని చెబుతున్నారు.
శ్రీలీలకు ముప్పు
అందంతో పాటు హైట్, చిన్న వయసు కావడంతో సీనియర్లు, జూనియర్ల పక్కన హీరోయిన్‌గా భాగ్యశ్రీ సెట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. అయితే శ్రీలీలకు భాగ్యశ్రీ రూపంలో ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అఖిల్‌తో నటిస్తున్న లెనిన్ నుంచి శ్రీలీలను తప్పించిన మేకర్స్ ఈమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నారు. ఇదే కాదు.. కింగ్డమ్‌లోనూ తొలుత విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ నటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆమె తప్పుకోవడంతో భాగ్యశ్రీని ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. ఈ రెండు సినిమాలు పెద్ద చిత్రాలు కావడంతో భాగ్యశ్రీ కెరీర్ దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. అటు శ్రీలీల టాలీవుడ్‌కు దూరంగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు భాగ్యశ్రీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











