పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై భూమిక కామెంట్స్.. ఏమన్నారంటే?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు సినిమాలకే కాదు, రాజకీయాల్లోనూ ఒక బ్రాండ్‌గా మారింది. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న పవన్, రాజకీయ నాయకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఎదుగుదలపై హీరోయిన్ భూమిక చావ్లా కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?
భూమిక చావ్లా... ఒకప్పుడు ఈ పేరు వినిపించగానే టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక వైబ్ ఉండేది. వరుస విజయాలు, విభిన్నమైన పాత్రలతో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న నటి ఆమె. తెలుగు సినిమాలకంటే ముందే హిందీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భూమిక, 'తేరే నామ్' సక్సెస్ తర్వాత భూమిక పేరు బాలీవుడ్ అంతటా మారుమోగింది. అక్కడ గుర్తింపు వచ్చిన తర్వాత తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ, ఇక్కడ కూడా తన సత్తాను చాటింది. చాలా తక్కువ సమయంలోనే 'ఖుషి', 'ఒక్కడు', 'సింహాద్రి' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే.. పెళ్లి తరువాత తెలుగులో సినిమా అవకాశాలు తగ్గాయి.

ఇదిలా ఉంటే.. భూమిక కెరీర్ 'ఖుషి' సినిమా చాలా స్పెషల్. దర్శకుడు ఎస్.జె. సూర్య తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక ప్రత్యేక మైలురాయి. ఆ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్‌గా నటించిన భూమిక, 'మధు' పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ సినిమా పవన్‌కే కాదు, భూమిక కెరీర్‌లో కూడా కీలకంగా నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇదే వీరిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా, అదే చివరి సినిమా కూడా కావడం. ఆ తర్వాత మళ్లీ ఈ హిట్ జంట తెరపై కనిపించలేదు. ఈ మధ్యే తెలుగులో మళ్లీ బిజీ అయిపోయింది భూమిక. ఎంసిఏ, సవ్యసాచి, యు టర్న్ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది భూమిక. ప్రస్తుతం యుఫోరియా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇటీవల వైజాగ్‌లో జరిగిన యుఫోరియా సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో భూమిక మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ 'ఖుషి' సినిమా నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం నిజంగా గర్వించదగ్గ ప్రయాణమని అన్నారు. ఒక సహనటిగా మాత్రమే కాదు, 'మధు'గా ఆయన జర్నీని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని భావోద్వేగంగా పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినీ స్థాయి నుంచి రాజకీయ స్థాయికి ఎదిగిన తీరు నిజంగా ప్రశంసనీయమని భూమిక వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపాయి.
ఇదిలా ఉంటే.. 'యుఫోరియా' సినిమాలో భూమిక కీలక పాత్రలో కనిపించనుంది. ముఖ్యంగా తల్లి పాత్రలో ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈతరం తల్లులు తమ పిల్లల విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలనే అంశాన్ని ఈ పాత్ర బలంగా చెప్పబోతుందని సమాచారం. భూమిక కూడా ఈ సినిమాపై నమ్మకంతో కనిపిస్తూ, ఇది తన కెరీర్‌లో 'సెకండ్ ఇన్నింగ్స్'కు మంచి మైలురాయి అవుతుందని వ్యాఖ్యానించారు. చాలా ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో కలిసి పనిచేయడం తనకు ఆనందంగా ఉందని కూడా తెలిపారు.
'యుఫోరియా' సినిమాలో భూమికతో పాటు సారా అర్జున్, నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ కుమార్తెలు నీలిమ గుణ, యుక్తా గుణ సంయుక్తంగా నిర్మిస్తుండగా, రాగిణి గుణ సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ యూత్‌ఫుల్ క్రైమ్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. యుఫోరియా ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంపై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











