ప్రతి రాత్రి నరకమే.. వాడుకొని వదిలేశాడు..: బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన
బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ ఇనయా సుల్తానా (Inaya Sultana). ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా కొనసాగుతోంది. ఇటీవల ఆహా ఓటీటీలో విడుదలైన '3 రోజెస్'సిరీస్‌లో నటించిన ఇనయా, ఆ సిరీస్ నుంచి పలు వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా, తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, లైఫ్ ఫెయిల్యూర్, తన బాయ్ ఫ్రెండ్ మోసాల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఈ ఇంటర్వ్యూలో బిగ్‌బాస్ తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పులపై ఇనయా మాట్లాడింది. బిగ్‌బాస్ ముగిసిన తర్వాత దాదాపు ఏడాది పాటు తన కెరీర్ చాలా బాగా సాగిందని తెలిపింది. బ్రాండ్ ప్రమోషన్లు, ఈవెంట్స్, ఓపెనింగ్స్ అంటూ వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పింది. చాలా కార్యక్రమాలకు తనను గెస్ట్‌గా పిలిచేవారని, ఆ ఏడాది మొత్తం లైఫ్ చాలా బిజీగా కొనసాగిందని గుర్తుచేసుకుంది. అయితే, ఏడాది గడిచిన తర్వాత ఒక్కసారిగా ఆఫర్లు తగ్గిపోయాయని, అదే సమయంలో తన జీవితంలో ఒంటరితనం ఎక్కువగా అనిపించిందని చెప్పుకొచ్చింది.

ఈ సమయంలో యాంకర్ ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ, బ్రేకప్ గురించి ప్రశ్నించగా... ఇనయా చాలా ఎమోషనల్‌గా స్పందించింది. 'ఎవరికైనా పేరెంట్స్ దగ్గర ప్రేమ దొరకనప్పుడు బయటివారి నుంచి ప్రేమ కోరుకుంటారు. ఎంత ధైర్యంగా కనిపించినా, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉన్నానన్న భావన చాలా బాధిస్తుంది. ఆ సమయంలో నాకు కూడా ఒక తోడు కావాలనిపించింది' అని చెప్పింది. ఒక దశలో తాను చనిపోతే కూడా ఎవరూ రారు అనే భావనలోకి వెళ్లిపోయానని, అదే సమయంలో తనను తాను పరీక్షించుకోవడానికి రెండు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నానని తెలిపింది.
మూడో రోజు స్నేహితుల నుంచి కాల్ వచ్చి 'ఎక్కడ ఉన్నావు? ఏమవుతోంది?' అని అడిగినప్పుడు తనకు మరింత బాధ కలిగిందని ఇనయా చెప్పింది. 'ఈ రెండు రోజుల్లో నాకు ఏదైనా జరిగి ఉంటే, నేను చనిపోయి ఉంటే, అసలు ఎవరు ఉండేవారు కాదేమో అనే ఆలోచన వచ్చి చాలా ఫీల్ అయ్యాను. అలాంటి సమయంలో నా జీవితంలో ఒక వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించింది' అని ఆమె భావోద్వేగంగా వెల్లడించింది.
అలాంటి పరిస్థితుల్లోనే తన జీవితంలో గౌతమ్ అనే వ్యక్తి వచ్చాడని ఇనయా చెప్పింది. అతను తనను చాలా ప్రేమిస్తున్నట్టు నటించాడని, తనపై ఇంతవరకు ఎవ్వరూ చూపించని ప్రేమను చూపించినట్టు అనిపించిందని తెలిపింది. 'ఆ ప్రేమ నిజమేనని నమ్మి మోసపోయాను. నా ఫేమ్, డబ్బు అన్నింటినీ వాడుకొని, తన అవసరాలు తీరాక నన్ను వదిలేశాడు' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ వ్యక్తిని నమ్మిన క్రమంలో శారీరకంగా కూడా దగ్గరయ్యానని, పెళ్లి చేస్తానని చెప్పడంతో తన జీవితాన్ని అతనితోనే కట్టిపడేసుకున్నానని ఇనయా చెప్పింది. అతనితోనే భవిష్యత్తు అంటూ ఎన్నో కలలు కన్నానని, సర్వస్వం అతనికే అర్పించానని తెలిపింది. 'నన్ను మానిప్యులేట్ చేసి, చివరికి నన్నే తప్పుగా సమాజానికి చూపించే ప్రయత్నం చేశాడు'అని ఆమె ఆరోపించింది.
ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయని తెలిసినా ఎందుకు జాగ్రత్తగా ఉండలేదని యాంకర్ ప్రశ్నించగా.. ఇనయా స్పందిస్తూ.. 'ఇంతవరకు నా జీవితంలో నాకు అంత ప్రేమ చూపించిన వ్యక్తి ఎవరూ లేరు. ఇలాంటి వాళ్లు ఉంటారని ఊహించలేదు. నేను గుడ్డిగా నమ్మేశాను. ఈ విషయంలో నాదే తప్పు'అని అంగీకరించింది. లోన్లీ ఫీలింగ్‌లో ఉన్నప్పుడు, 'చనిపోయినా ఎవరు ఉండరు' అనే భావనలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే తన జీవితాన్ని ఈ దశకు తీసుకువచ్చాయని చెప్పింది.
ఒక సందర్భంలో ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చిందని, కానీ అతని కోసం తన ప్రాణాలు తీసుకోవడం అవసరం లేదని అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయానని చెప్పింది. ఇప్పటికీ కూడా ప్రతి రోజు నరకం అనుభవిస్తున్నాను. నిద్ర మాత్రలు లేకుంటే నిద్ర రాదని చెప్పింది. 'ఇది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్, మానిప్యులేషన్ లాంటిదే. అతను నన్ను మోసం చేస్తున్నాడని చిన్న చిన్న సంకేతాలు కనిపించినా, అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయాను' అంటూ ఇనయా తీవ్రంగా భావోద్వేగానికి గురైంది.
ఇనయా సుల్తానా చేసిన ఈ వ్యాఖ్యలు బిగ్‌బాస్ తర్వాత వెలుగులోకి వచ్చిన సెలబ్రిటీల జీవితాల్లోని మరో కోణాన్ని చూపిస్తున్నాయి. ఫేమ్, కెరీర్ ఒడిదుడుకుల మధ్య, ఒంటరితనం, ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎంతగా ప్రభావితం చేస్తాయో ఆమె అనుభవం చెబుతోంది. ప్రస్తుతం ఇనయా తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











