బయోపిక్ లంటే బెంబేలెత్తిపోతున్న దక్షిణాది భామలు
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అయితే, చరిత్రకెక్కిన ముఖ్యమైన ఘట్టాల దగ్గర నుంచి మనుషుల వరకూ అందరి చరిత్రలను తెరకెక్కించేస్తున్నారు. ఈ రేసులో టాప్ హీరోయిన్ల దగ్గర నుంచి సూపర్ స్టార్ ల వరకూ అందరూ తమ ఖాతాల్లో తలో బయోపిక్ వేసేసుకున్నారు. కొత్త హీరోయన్లు సైతం బయోపిక్ దొరికితే చాలు సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ, దక్షిణాదిన మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
బయోపిక్ లంటేనే నటీనటుల నటనా పటిమకు పెద్ద పరీక్ష, కాబట్టి కెరీర్ లో ఒక్క బయోపిక్ పడినా చాలని భావిస్తారు చాలామంది. కానీ, మన టాప్ హీరోయన్లు మాత్రం బయోపిక్ మాట వింటనే ఆమడ దూరం పారిపోతున్నారట. అలాంటి ఆఫర్లు వస్తే ముందూ వెనుకా ఆలోచించకుండా నేరుగా వాటిని రిజెక్ట్ చేసి పాడేస్తున్నారట.

సమంత, శ్రుతిహాసన్, కాజల్ తమన్నా ఈ మధ్యకాలంలోనే ఎన్నో బయోపిక్ లను రిజెక్ట్ చేశారట. అయితే, ఈ అమ్మాయిలందరూ మహిళా ప్రాధాన్యతగల చిత్రాల్లో మాత్రం అంతే చురుగ్గా నటిస్తున్నారు. బయోపిక్ లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఈ భామలకు భారీ పారితోషకం ముట్టచెబుతామన్నా, వాటిలో నటించేందుకు ఇష్టపడటంలేదన్నది ఇన్ సైడ్ స్టోరీ.
మరోవైపు బాలీవుడ్ లో విద్యాబాలన్, కంగనా రనౌత్, తాప్సీ, ఆలియా భట్, జాన్వీ కపూర్, సోనమ్ కపూర్ లాంటి తారలందరూ బయోపిక్ లతో మంచి మార్కులు వేయించుకున్నారు. అంతేకాక బోలెడు అవార్డులూ రివార్డులూ కూడా కొల్లగొట్టారు. కానీ, ఇవన్నీ కూడా మన హీరోయిన్లకు బయోపిక్ లపై ఆసక్తిని కలిగించలేకపోతున్నాయి. మరి భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











