‘సుఖం కోసం హీరోయిన్లకు అలాంటి చాక్లెట్లు... కాంప్రమైజ్ అడిగితే కట్ చేయడమే’
సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో హీరోయిన్ల జీవితాలను నాశనం చేసే క్యాస్టింగ్ కౌచ్ భూతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కొందరి స్వార్ధం, లైంగిక వాంఛల కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులైన నటీనటుల జీవితాలు తెల్లారిపోయాయి. క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం దేశంలో ఏదో మూలన.. ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉంటారు. తాజాగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ప్రలోభాలు, క్యాస్టింగ్ కౌచ్‌లపై సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
2005లో ఆషిక్ బనాయా అపనే సినిమాతో దేశాన్ని ఊపేసింది తనుశ్రీ దత్తా. బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో కలిసి రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయింది. అదే సంవత్సరం తెలుగులో నందమూరి బాలకృష్ణతో వీరభద్ర సినిమాలో నటించింది. కెరీర్ పడుతూ లేస్తూ సాగుతుండగా 2013 తర్వాత సినీరంగానికి పూర్తిగా దూరమైంది తనుశ్రీ. దానికి మానసికంగా కుంగిపోవడంతో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసింది. అలాగే తాను క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నానని, తన పనులు తాను చేసుకోలేకపోతున్నానని అప్పట్లో తనుశ్రీ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఇకపోతే.. కొన్నేళ్ల క్రితం దేశంలో ఉద్ధృతంగా సాగిన మీటూ ఉద్యమానికి నాంది పలికింది తనుశ్రీ దత్తాయే. బాలీవుడ్ స్టార్ హీరో నానాపటేకర్ తనను తైంగిక వేధించాడని ఆమె బాంబు పేల్చింది. అలాగే నగ్నంగా డ్యాన్స్‌లు చేయాలని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బలంతం చేశాడని చేసిన ఆరోపణలు భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. తనుశ్రీ దత్తా వేసిన బాటలో పలువురు హీరోయిన్లు, మహిళా నటులు తమపై జరిగిన దారుణాలు, పైకి పెద్ద మనుషుల్లా చెలామణి అయ్యే వారి బాగోతాలను బయటపెట్టారు. చాలా రోజుల తర్వాత తనుశ్రీ దత్తా మీడియా ముందుకు వచ్చారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నో ఆశలు, కోరికలతో ఇండస్ట్రీలోకి వచ్చే కొత్తవారు క్లిష్టపరిస్ధితుల్లోకి లాగబడుతున్నారు. ప్రశంసలు, రకరకాల వాగ్థానాలతో కొందరు వారిని ఆకర్షిస్తారు. అపరిచితుల నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే సలహాలు పెద్దయ్యాక కూడా ఉపయోగపడతాయి. వినోద పరిశ్రమలో ఎరలు వేరే రకంగా ఉంటాయి. చిన్నప్పుడు అపరిచితులు చాక్లెట్‌తో ఎరవేసినట్లే.. ఇండస్ట్రీలోనూ చాక్లెట్లు ఉంటాయి. కాకపోతే అవి వేరే రకంగా ఉంటాయి. వాటికి చిక్కితే మీ కలలు, ఆశల్ని ఆసరాగా చేసుకుని కొందరు వారి లైంగిక కోరికలను తీర్చుకుంటారని తనుశ్రీ అన్నారు.
ఇలాంటి వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడటానికి బలమైన కారణం ఉంది. ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వచ్చే యువ ఔత్సాహికులను హెచ్చరించడానికే ఇలా చేస్తున్నా. ఈ దారుణాలపై పోరాడే నటీమణులు దోపిడీ బారినపడి చివరికి ప్రజల దృష్టి నుంచి మాయమైపోతారు. వీటిని ఎదుర్కొని నిలబడినవారు సక్సెస్ అవుతారు. ఈ వలలో చిక్కిన వారు ఇండస్ట్రీలో నెగ్గుగురాలేక.. తిరిగి ఇంటికి వెళ్లలేక వ్యభిచార కూపంలోకి దిగుతున్నారని తనుశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.
సినీ పరిశ్రమ పరాజితుల కంటే సక్సెస్ సాధించిన వారినే గుర్తుపెట్టుకుని హైలైట్ చేస్తుంది. అందుకే ఇలాంటి కథనాలు చాలా అరుదుగా మాత్రమే బయటకొస్తాయి. పరిశ్రమలో కమిట్‌మెంట్ గురించి ప్రస్తావించినా.. అటు వైపు మిమ్మల్ని ప్రోత్సహించినా.. అలాంటి వారికి దూరంగా ఉండండి. గతంలో నా వద్ద కాంప్రమైజ్ గురించి మాట్లాడిన ఓ నటితో ఫ్రెండ్‌షిప్‌ని కట్ చేశాను. అయినా నేను నటిని .. ఒకరికి నా జీవితాన్ని, శరీరాన్ని అమ్ముకోను అని తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


















