క్యాన్సర్‌తో స్టార్ హీరోయిన్ పోరాటం.. గుండు చేసుకొని ఎమోషనల్‌గా వీడియో
వైద్య శాస్త్రం ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నా.. మొండి వ్యాధులకు చికిత్సను, మందులను కనుగొంటున్నా క్యాన్సర్ మాత్రం లొంగడం లేదు. సైలెంట్ కిల్లర్‌గా పిలిచే వ్యాధుల్లో క్యాన్సర్ ముఖ్యమైనది. ప్రాణాల మీదకు వచ్చే వరకు సదరు వ్యక్తిలో క్యాన్సర్ జాడ కనిపించదు. ఈ మహమ్మారి బారినపడి ప్రతి ఏడాది లక్షలాది మంది ప్రాణాలు విడుస్తున్నారు. క్యాన్సర్‌ను చాలా రకాలుగా వర్గీకరించగా.. చాలా సందర్భాల్లో పరిస్ధితి చేయిదాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం, వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం ఒక్కటే క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల్లో అవగాహనను కల్పించేందుకు ప్రతి యేటా ఆగస్ట్ 1ని క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించామని సంబరపడటానికి లేదు. ఈ వ్యాధికి చికిత్స అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నది.. ముఖ్యంగా పేదలు, అల్పాదాయ వర్గాలకు క్యాన్సర్ అంటే నడినెత్తిన పిడుగులాంటిది. క్యాన్సర్ చికిత్సకు అయ్యే ఖర్చును భరించలేక , లోలోపల ఆ మహమ్మారి అవయవాలను కబళిస్తుంటే అల్లాడిపోతూ.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తుంటారు. ఎన్నో స్వచ్చంద సేవా సంస్థలు, దాతలు, ప్రముఖులు పేద క్యాన్సర్ రోగులకు చేతనైన సాయం చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఎంతోమంది ప్రముఖులు క్యాన్సర్ కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు. వీరిలో అక్కినేని నాగేశ్వరరావు, రామిరెడ్డి, రాజబాబు, రాజేంద్రకుమార్, కేఆర్ రామస్వామి, ఈవీవీ సత్యనారాయణ, ప్రాణ్ వంటి నటులను క్యాన్సర్ బలి తీసుకుంది. అయితే కొందరు తారలు మాత్రం మొక్కవోని ఆత్మ విశ్వాసం, గుండె ధైర్యంతో క్యాన్సర్‌కు ఎదురొడ్డి నిలిచారు. హంసా నందిని, మనీషా కొయిరాల, సోనాలి బింద్రే, గౌతమి , మమతా మోహన్‌దాస్, మహిమా చౌదరి, సంజయ్ దత్, తహీరా కశ్యప్, రాకేష్ రోషన్ వంటి స్టార్స్ క్యాన్సర్‌ను జయించారు.

వీరు చూపిన బాటలోనే క్యాన్సర్ మహమ్మారిపై పోరాటానికి సిద్ధమయ్యారు హిందీ బుల్లితెర నటి హీనా కాన్. తాను స్టేజ్ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమె ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను బలంగా ఉన్నానని, ఆ భగవంతుడి దయ.. కుటుంబ సభ్యుల ఆశీస్సులతో తాను పూర్తి ఆరోగ్యంగా ఉంటానని హీనా ఖాన్ ఆకాంక్షించారు. యే రిష్తా క్యా కెహ్లాతా హై, కసౌటి జిందగీ కే, నాగిన్ తదితర సీరియల్స్‌తో హిందీ బుల్లితెరపై హీనా ఖాన్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. బిగ్‌బాస్‌లోనూ అలరించిన ఆమె ఖత్రోంకీ ఖిలాడీ సీజన్ 8 రియాలిటీ షోలో నటించింది. ప్రస్తుతం అమెజాన్ టీవీలో నామాకూల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అంతలోనే తనకు క్యాన్సర్ ఉందంటూ బాంబు పేల్చింది హీనా ఖాన్.

క్యాన్సర్ తేలిన నాటి నుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్న హీనా ఖాన్ ఏమాత్రం భయపడకుండా ఈ వ్యాధితో పోరాడుతోంది. క్యాన్సర్ చికిత్సలో తొలి అడుగుగా తలపై జుట్టు తీసేసి గుండు చేయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హీనా స్వయంగా పంచుకున్నారు. క్యాన్సర్ చికిత్స కారణంగా తన చుట్టూ నెమ్మదిగా రాలిపోతోందని.. దీనికి గుండు చేయించుకోవడం ఒకటే పరిష్కారమని, బాధ కలిగే విషయమే అయినా తప్పదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పలువురు సెలబ్రెటీలు, అభిమానులు హీనా ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











