బిగ్‌బాస్ బ్యూటీ ఇంట్లో బిజినెస్‌మ్యాన్ సూసైడ్.. అసలేం జరిగిందంటే?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు గత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శాండిల్‌వుడ్ డ్రగ్స్ రాకెట్ దేశాన్ని కుదిపేయగా.. ఆ తర్వాత కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం అంతకుమించి సంచలనం సృష్టించింది. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపాడనే కారణంతో.. తన వీరాభిమాని రేణుకా స్వామిని చిత్ర హింసలకు గురిచేసి అత్యంత దారుణంగా చంపాడు దర్శన్. ఈ కేసులో ఆయన అరెస్ట్, జైలు జీవితం భారతీయ చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. ఇదే సమయంలో కన్నడ పరిశ్రమకు చెందిన నటి రన్యారావు విదేశాల నుంచి చట్టవిరుద్ధంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డీఆర్ఐ అధికారులకు దొరికిపోయింది. ఈ సంఘటనలతో కన్నడ ఇండస్ట్రీ పరువు గంగపాలైంది. తాజాగా ఓ నటి ఇంట్లో వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ వివరాల్లోకి వెళితే..

Businessman Found Dead at Kannada Actress Krishi Thapanda s Home

బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ కృషి తాపండ నివాసంలో వైశాఖ్ అనే వ్యాపారవేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు అధికారులు చెబుతున్న దానిని బట్టి కృషి తాపండ యలహంకలో ఉన్న సమయంలో నిన్న రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కోసం పోలీసులు గాలించినప్పటికీ ఎలాంటి లేఖ దొరకలేదు. వైశాఖ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

వైశాఖ్‌కు 15 ఏళ్ల క్రితం వివాహమై భార్య, కుమారుడు ఉన్నాడు. ఆయనకు కారు గ్యారేజ్, ఆటోమొబైల్ షాప్ వ్యాపారాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరుకు చెందిన అరవింద రెడ్డి అనే వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో అరెస్ట్ అయి కొద్దిరోజులు జైలు శిక్ష అనుభవించిన వైశాఖ్ విడుదలయ్యాడు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఫిబ్రవరిలో అరవింద్ రెడ్డికి ఓ గుర్తుతెలియని కొరియర్ వచ్చింది. అందులో కృషి తాపండతో వివాదాలను పరిష్కరించుకోవాలని, ఆమెకు క్షమాపణలు చెప్పి 6 నుంచి 7 కోట్ల రూపాయల డబ్బు పంపాలని, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని అరవింద్ రెడ్డిని హెచ్చరిస్తూ లేఖ పంపారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు వైశాఖ్‌ను అరెస్ట్ చేశారు. అయితే అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో వైశాఖ్‌పై తదుపరి దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వైశాఖ తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. డిప్రెషన్‌ సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కొంతకాలంగా కృషి తాపండ ఫ్లాట్‌లో ఆమెతో కలిసే ఉంటున్నాడు. నిన్న రాత్రి కృషి తాపండ పని మీద బయటకు వెళ్లగా ఇంట్లో వైశాఖ్ ఒక్కడే ఉన్నాడు. కృషికి ఫోన్ చేసి నేను చనిపోతున్నానని చెప్పడంతో ఆమె ధైర్యం చెప్పి ఓదార్చింది. అయితే నటి ఇంటికి వచ్చేసరికి వైశాఖ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

అయితే వైశాఖ్ మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ స్వగ్రామం చామరాజపేట శ్మశానవాటికలో వైశాఖ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. స్నేహితుడిని చివరిసారి చూసేందుకు కృషి వెళ్లగా.. అప్పటికే అంత్యక్రియలు పూర్తయిపోవడంతో పాటు మృతుని కుటుంబసభ్యులు ఆమెతో గొడవకు దిగారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కన్నడ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైశాఖ్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక కృషి తాపండ విషయానికి వస్తే.. కర్ణాటకలోని కూర్గ్‌కు చెందిన ఆమె 2014లో మిస్ కర్ణాటకగా ఎంపికయ్యారు. ఇంటర్‌కాల్ అనే సంస్థలో పనిచేస్తుండగా ఆమెకు కహి అనే సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కింది. దాంతో ఉద్యోగాన్ని వదులుకుని సినీరంగం వైపు అడుగులు వేసింది కృషి తాపండ. ఈ క్రమంలో అకీరా, ఈరాడు కనాసు, ఐరా, కన్నడక్కాగి ఓందాన్ను ఓట్టి, భారాతే, లంకే, గణ సినిమాలలో నటించింది. అలాగే కన్నడ బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కించుకున్న కృషి తాపండ 12 వారాల పాటు హౌస్‌లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X