ఆర్తి అగర్వాల్ మరణం వెనుక.. అతడి వల్లే ఆ అమ్మాయి, టాప్ సీక్రెట్స్ లీక్ చేసిన నిర్మాత
ఆర్తి అగర్వాల్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. చిన్న వయసులోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అనుభవించిన ఈ ముద్దుగుమ్మ అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోవడమే కాదు.. తిరిగిరాని లోకాలకు తరలిపోయింది. విపరీతంగా బరువు పెరిగిపోవడంతో లైపో సర్జరీ చేయించుకోవడంతో ఆ శస్త్రచికిత్స వికటించి ఆర్తి అగర్వాల్ కన్నుమూసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె జీవితం, మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు నిర్మాత చంటి అడ్డాల.
ముంబైకి చెందిన ఆర్తి అగర్వాల్.. అమెరికాలో పెరిగారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె తన నవ్వు, సొట్ట బుగ్గలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. ఈ క్రమంలో యువ నటులతో పాటు అగ్ర హీరోలందరితో నటించారు. పాగల్పాన్ అనే హిందీ చిత్రం ద్వారా తొలుత నటిగా పరిచయమయ్యారు ఆర్తి అగర్వాల్. ఈ చిత్రంలో ఆమె నటన, అందం చూసిన దర్శకుడు విజయ్ భాస్కర్.. వెంకటేష్‌తో తీస్తున్న నువ్వు నాకు నచ్చావ్‌లో అవకాశం కల్పించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె పేరు మారుమోగింది.

అనంతరం నువ్వు లేక నేను లేను, ఇంద్ర, వసంతం, అందాల రాముడు , అడవి రాముడు , బాబీ తదితర చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా నిలిచింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆర్తి అగర్వాల్ అలా ఎందుకు చేశారు అనే దానిపై అప్పట్లో మీడియాలో రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చాయి. ఓ టాప్ హీరోతో ప్రేమాయణం కారణంగానే ఆమె సూసైడ్‌కు యత్నించారని గాసిప్స్ వైరల్ అయ్యాయి.
ఆసుపత్రిలో కోలుకున్న ఆర్తి అగర్వాల్ తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. తన చెల్లెలు అదితి అగర్వాల్‌ను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. అయితే ఆత్మహత్యకు ముందు నాటి సక్సెస్‌ను ఆమె అందుకోలేకపోయారు. తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అయినప్పటికీ పట్టువదలకుండా సినిమాలు చేస్తూ వచ్చిన ఆర్తి అగర్వాల్.. ఉజ్వల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లాడి ఇండస్ట్రీకి షాకిచ్చింది. అయితే వైవాహిక జీవితం కూడా ఆమెకు కలిసి రాలేదు. పెళ్లయిన రెండళ్లకే ఉజ్వల్‌కు విడాకులు ఇచ్చిన ఆర్తి అగర్వాల్.. కొన్ని చిత్రాల్లో నటించింది. మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.
సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడం, భర్తతో విడాకులు, వ్యక్తిగత జీవితంలో సమస్యల కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు ఆర్తి అగర్వాల్. దీనికి తోడు ఆ సమయంలో విపరీతంగా లావు పెరిగిపోవడంతో బరువు తగ్గేందుకు కొన్ని రకాల సర్జరీలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే 2015 జూన్ 6న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో హఠాన్మరణం చెందారు. చనిపొయే సమయానికి ఆర్తి అగర్వాల్ వయసు కేవలం 31 సంవత్సరాలే కావడం గమనార్హం. అంత చిన్న వయసులోనే కెరీర్‌లో పీక్స్ చూసి, అంతే వేగంగా నేలరాలారు ఆర్తి.
ఈ క్రమంలో ఆర్తి అగర్వాల్ జీవితం, మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత చంటి అడ్డాల. ఆమెతో అల్లరి రాముడు, అడవి రాముడు వంటి సినిమాలను ఆయన నిర్మించారు. అల్లరి రాముడులో తొలుత ఛార్మిని తీసుకున్నామని.. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆర్తిని తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక ఆర్తి అగర్వాల్ జీవితం అలా కావడానికి ఆమె తండ్రే కారణమని చంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్తి షూటింగ్ సెట్‌లో చాలా సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేదని.. కానీ ఆమె తండ్రి వస్తే మాత్రం మౌనంగా ఉండిపోయేదని అన్నారు. సినిమాల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆర్తి అగర్వాల్ జీవితాన్ని ఇలా చేశాయని చంటి అడ్డాల ఆరోపించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











