బీజేపీ వద్ద ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నావు? రష్మి కను చీల్చి చెండాడుతున్న కాంగ్రెస్, నెటిజన్లు
అందం , అభినయంతో నేషనల్ క్రష్‌గా మారారు కన్నడ కస్తూరి రష్మిక మందన్న. కిరాక్ పార్టీ ద్వారా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో స్టార్‌డమ్ పొందారు. చలో, భీష్మ, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలతో అగ్ర కథానాయికగా మారారు. బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి యానియల్‌తో అక్కడా జెండా పాతారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ - ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సికిందర్‌లోనూ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి లక్కీగాళ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇలాంటి వేళ వివాదంలో చిక్కుకున్నారు రష్మిక మందన్న. అది కూడా రాజకీయాల వల్ల. ఇటీవల ముంబైలో పర్యటించిన ఈ ముద్దుగుమ్మ తన అనుభవాలను, చూసిన సంగతులను వీడియో రూపంలో ట్విట్టర్‌లో పంచుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభమైన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ - ఎంటీహెచ్ఎల్‌పై (అటల్ సేతు )ప్రయాణించిన రష్మిక .. ఈ భారీ ఫ్లైఓవర్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ద్వారా 2 గంటలు పట్టే ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని తెలిపింది. కారులో ప్రయాణిస్తూ వెళ్లిన ఆమె.. ఓ చోట అగి మరీ అటల్ సేతు గురించి మరిన్ని వివరాలు వెల్లడించింది.

భారత్‌లో సాధ్యం కానిది ఏది లేదని..గడిచిన 10 ఏళ్లలో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని రష్మిక అన్నారు. ఈ వంతెన కేవలం 7 ఏళ్లలోనే పూర్తయ్యినట్లుగా తనకు తెలిసిందని.. మొదల అటల్ సేతును చూసినప్పుడు తనకు మాటలు రాలేదని ఆమె తెలిపారు. యంగ్ ఇండియా స్పీడుగా దూసుకెళ్తోందని.. భారత్ చాలా తెలివైన దేశమని, యువత అభివృద్ధిని చూసి బాధ్యతగా ఓటు వేయాలని రష్మిక పిలుపునిచ్చింది. అనంతరం'' సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా.. వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ ఇండియా వరకు ప్రజలను కలుపుతుంది, హృదయాలను కలుపుతుంది .. మై ఇండియా '' అంటూ సదరు ట్వీట్‌కు క్యాప్షన్ పెట్టింది.
అయితే రష్మిక వీడియో చివరికి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ప్రజలను కనెక్ట్ చేయడం.. వారి జీవితాలను మరింత మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైంది మరొకటి లేదంటూ రష్మిక ట్వీట్‌ను మోడీ రీట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. అటల్ సేతు నిర్మాణం, అసలు వాస్తవాలను వివరిస్తూ అదే బ్రిడ్జిపై మరో వీడియో చేయాలని రష్మికకు కేరళ కాంగ్రెస్ సవాల్ విసిరింది. అటల్ సేతుని చాలా మంది ఉపయోగించుకోవడం లేదని.. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన బాంద్రా - వర్లీ సీ లింక్ వల్లే ఎక్కువ టోల్ వస్తోందని, కొన్ని గణాంకాలను ట్వీట్ చేసింది.

రూ.17,840 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన అటల్ సేతుపై ఒక కారుకి.. సింగిల్ ట్రిప్‌కు రూ.250 చొప్పున టోల్ వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకారం.. ఆకట్టుకునే డిజైన్, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, అటల్ సేతు గణనీయమైన సంఖ్యలో ట్రాఫిక్‌ను ఆకర్షించడంలో విఫలమైందని ఆరోపించింది.
వంతెన ప్రారంభమైన తొలి 102 రోజులలో కేవలం రూ.22.57 కోట్ల టోల్ మాత్రమే వసూలైందని, అంటే నెలకు రూ.6.6 కోట్ల ఆదాయం మాత్రమే వస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఇది అంచనా వేయబడిన దానికంటే (రూ.30 కోట్లు) చాలా తక్కువని చెప్పింది. ఇదే సమయంలో 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1634 కోట్ల వ్యయంతో నిర్మించిన బాంద్రా - వర్లీ సీ లింక్ ప్రతి కారుకు రూ.85 చొప్పున టోల్ వసూల్ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సీ లింక్ 2022 మార్చిలోనే రూ.9.95 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు కాంగ్రెస్ వెల్లడించింది.
ఈ వాస్తవాలను తెలియజేస్తూ రష్మికపై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. ''డియర్ రష్మిక మందన్నా జీ.. ముంబై వాసులు ఈ వంతెనను ఎందుకు ఉపయోగించడం లేదు అనే దానిపై వీడియో చేయలగలరా, దీనికి అధిక టోల్ రేట్లే కారణమా..? మరి ఈ సవాల్‌పై స్టార్ హీరోయిన్ స్పందిస్తారా..? లేక రష్మిక వీడియో బీజేపీ స్పాన్సర్డ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్పాన్సర్డ్ ప్రకటనా అని కాంగ్రెస్ ప్రశ్నించింది. అటు నెటిజన్లు, కాంగ్రెస్ మద్ధతుదారులు సైతం రష్మికను ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ వద్ద ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నావంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి బీజేపీ వైపు నుంచి కూడా వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి. మరి ఈ వివాదంపై రష్మిక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











