Tamannaah Bhatia పీకల్లోతు కష్టాల్లో తమన్నా.. ఆ రెండు కేసుల్లో మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. నిబంధలనకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్‌లను '' ఫెయిర్ ప్లే '' యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రమోట్ చేసినందుకు తమన్నాకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం సోమవారం తమన్నా పోలీసుల ఎదుట హాజరుకావాల్సి వుంది. కానీ షూటింగ్ పనుల కారణంగా తాను అందుబాటులో లేనని లాయర్ ద్వారా ఆమె సమాచారం అందించారు. ఇప్పటికే ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. తమన్నా కూడా చిక్కులను ఎదుర్కొంటారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాణిజ్య ప్రకటనల విభాగంలో అనుభవం వున్న డైరెక్టర్ గీతా కృష్ణ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ మ్యాచ్‌లను ''ఫెయిర్ ప్లే'' యాప్‌లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు కోట్లలో నష్టం వాటిల్లినట్లుగా ''వయాకామ్'' సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిలో భాగంగానే తమన్నా, సంజయ్ దత్ సహా మరికొందరికీ సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు జారీ చేసింది.

ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను దాదాపు రూ.23 వేల కోట్లకు పైగా వెచ్చించి వయాకామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో ప్రచార హక్కులన్నీ ఆ కంపెనీవే. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానెల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం సెలబ్రెటీల చేత ప్రమోట్ చేయించింది. అలా ప్రమోషన్స్‌లో పాల్గొన్న వారిలో తమన్నా కూడా ఒకరు.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గీతా కృష్ణ మాట్లాడారు. నిజానికి తమన్నాకి గతంలో వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌లో పాల్గొన్న అనుభవం వుంది. అయినప్పటికీ తన వద్దకు వచ్చిన యాడ్ , దానిని ఇస్తున్న సంస్థ, అది ఏ విధమైనది అనే దానిపై క్షుణ్ణంగా తెలుసుకోలేదేమోనని గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.

ముంబైలో వాణిజ్య ప్రకటనలకు సంబంధించి బడా యాడ్ ఏజెన్సీలు వున్నాయని .. వాటి ద్వారా మాత్రమే సెలబ్రెటీలు ఒప్పందాలు చేసుకుంటారని ఆయన తెలిపారు. మరి ఫెయిర్ ప్లే .. తమన్నాతో నేరుగా ఒప్పందం చేసుకుందా, లేక ఏదైనా సంస్థ ద్వారా స్పందించారా అన్నది తెలియాల్సి వుందని గీతా కృష్ణ చెప్పారు.
ఈ మొత్తం సైబర్ క్రైమ్ వ్యవహారంలో తమన్నా రెండు కేసులను ఎదుర్కొనే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏజెన్సీకి చెప్పకుండా వాణిజ్య ప్రకటనలో నటించడం, రెండోది ఫెయిర్ ప్లే చట్ట వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేయడం, దానిని తమన్నా ప్రమోట్ చేయడం . రెండోది చాలా సంక్లిష్టమైనదని, పెద్ద కేసుగా కూడా మారవచ్చునని గీతాకృష్ణ పేర్కొన్నారు.
కంపెనీ, యాడ్ ఏజెన్సీ, మోడల్స్ ఈ మూడు అంశాలు వేరు వేరని .. ఇందులో లోతైన అవగాహన వున్నప్పుడే సెలబ్రెటీలు బ్రాండ్ అండార్స్‌మెంట్లకు అగ్రిమెంట్ చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఆషామాషీగా , సరైన అవగాహన లేకుండా యాడ్స్‌లో నటిస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వుంటుందని సూచించారు. ఫెయిర్ ప్లే వ్యవహారంలో తమన్నా .. పొరపాటుపడిందా, లేక మరేదైనా కారణాలు వున్నాయా అన్నది మహారాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం తేల్చనుంది. తమన్నా, సంజయ్ దత్, సాహిల్ కాకుండా రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని పెద్ద తలకాయలు బయటకొస్తాయేమో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











