‘రోజుకి లక్షల్లో రెమ్యునరేషన్... ఆ హీరోయిన్ నోట్ల కట్టల్ని పరుపులో కుట్టేసి ’
చిత్ర పరిశ్రమకు ఎందరో నటీనటులు వచ్చారు, వెళ్లారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ ప్రజల గుండెల్లో, చరిత్రలో నిలిచిపోయినవారు కొందరే ఉంటారు. ఈ కోవలోకే వస్తారు సిల్క్ స్మిత. మత్తెక్కించే చూపులతో, నెమలిలా నాట్యంతో, తన ఒంపు సొంపులతో ఒక తరాన్ని ఉర్రూతలూగించారు సిల్క్ స్మిత. ఐటెం సాంగ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి స్టార్ హీరోలు, హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సంపాదించారు సిల్క్. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిన ఈ నటి.. అభిమానులకు తీరాన్ని విషాదాన్ని మిగిల్చారు.
చిన్న వయసులోనే పెళ్లి
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. ఊహా తెలియని వయసులోనే పెళ్లి చేసుకున్న ఆమెకు అత్తగారింట్లో వేధింపులు ఎక్కువయ్యాయి. బాధల్ని పంటి బిగువున భరించినప్పటికీ.. చివరికి ఓపిక నశించి ఇల్లు వదిలి మద్రాస్ పారిపోయారు. జీవనం సాగించడానికి టచ్ అప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ.. సినిమాలలో చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చారు సిల్క్ స్మిత. ఈ దశలో మలయాళ దర్శకుడు ఆంటోనీ ఈస్ట్‌మన్‌తో పరిచయంతో విజయలక్ష్మీ కాస్తా సిల్క్ స్మితగా మారి వాంప్ రోల్స్, డ్యాన్సర్‌గా ప్రేక్షకులను అలరించి మాస్ ఫాలోయింగ్ అందుకున్నారు.

మోసం తట్టుకోలేక
స్టార్ హీరోల సినిమాలైనా సరే ఆవిడ ఐటెం సాంగ్స్ ఉండాల్సిందే అన్నంతగా గుర్తింపు తెచ్చుకున్నారు సిల్క్ స్మిత. అతి తక్కువ కాలంలోనే దాదాపు 450కి పైగా సినిమాలలో నటించి విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. అయితే చిన్న వయసులోనే డబ్బు, పేరు ఆమెను ముంచెత్తింది. కానీ అయినవాళ్లు మోసం చేయడం, ప్రేమ విఫలం కావడం, నిర్మాతగా మారి నిర్మించిన చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై డిప్రెషన్‌లోకి వెళ్లిన సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఇండస్ట్రీలో ఓ మిస్టరీయే. కాగా.. ఇండస్ట్రీలో సిల్క్ స్మితకు ఉన్న అతి తక్కువ మంది సన్నిహితుల్లో డిస్కో శాంతి కూడా ఒకరు. అప్పట్లో స్మిత, అనూరాధ, శాంతి చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్కో శాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కరెన్సీ కట్టలపై నిద్ర
సిల్క్ స్మిత చాలా మంచి అమ్మాయి.. క్షణికావేశంలో అలాంటి నిర్ణయం తీసుకుంది. బాంబేలో ఉన్న నాకు ఆమె మరణవార్త తెలిసి పిచ్చిలేచిపోయింది. తను చాలా క్యూట్‌గా మాట్లాడుతుంది, ప్రతి విషయం నాతో చెప్పేది. ఆమెను అక్కా అని పిలిచేదానిని.. మీరెందుకు అద్దె ఇంట్లో ఉన్నారు.. అప్పట్లోనే ఆమెకు ఒక రోజుకు లక్షల్లో రెమ్యునరేషన్. నేను రావడానికి ముందే రోజుకి లక్ష. మేం లక్షలు ఎప్పుడు చూశాం.. వచ్చి ఒక పది సంవత్సరాల తర్వాత లక్ష చూశాం. ఆమె ఒక్కరోజుకు లక్ష నుంచి 3 లక్షలు తీసుకునేవారు. ఆమె ఎప్పుడూ చెబుతుండేది.. ఆ డబ్బులు తెచ్చి మంచం మీద వేసేసి బెడ్‌షీట్ వేసి దాని మీద పడుకునేది. నేను వేషాల కోసం తిరిగినప్పుడు ఎవ్వరూ ఇవ్వలేదు.. ఆ డబ్బులు వేసుకుని పడుకుంటున్నా అని నాతో చెప్పేది అని డిస్కో శాంతి తెలిపారు.
ఆ గ్రేస్ ఎవ్వరికీ లేదు
అప్పట్లోనే ఆమె ఉండే ఇంటి అద్దె నెలకు 5 లక్షల రూపాయలు. ఇల్లు అద్దెకు తీసుకుని మొత్తం రీ మోడలింగ్ చేయించేది. ఆ ఖర్చుతో ఇల్లే కొనుక్కోవచ్చు.. ఇంటి లోపల ఇంకెంత ఖర్చు పెట్టిందో. ఆమె ముందు ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా మాట్లాడేవాడు కాదు.. మేమిద్దరం కూర్చొని మాట్లాడుతుంటే నా దగ్గరికి వచ్చి షాట్ రెడీ అని చెప్పేవారు... తనకి ఆ విషయం చెప్పడానికి కూడా భయపడతారు. ఇండస్ట్రీకి వచ్చి మధ్యలో కొంతకాలం ఖాళీగా ఉన్నారు.. తర్వాత నేనొచ్చాను, స్మిత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటికీ కూడా ఆ అమ్మాయికి షాట్ రెడీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఆ మర్యాద ఆ అమ్మాయికి ఎక్కడా తగ్గలేదు. షూటింగ్‌కి కూడా లేట్‌గానే వచ్చేది.. శాంతి నేను రేపు పదకొండు, పన్నెండు గంటలకి వస్తానని ముందే చెప్పేది. మా ముగ్గురిని తీసుకుంటే డ్యాన్స్ ఎక్కువ చేసేది అనూరాధ.. స్టైల్, బాడీ, ఆ గ్రేస్ అంతా స్మితదే.. తర్వాతి ప్లేస్ నాది అని డిస్కో శాంతి వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సిల్మ్ స్మిత వైభవం గురించి ఆమె అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











