నాలుగు నిమిషాలకు కోటిన్నర చార్జ్: అల్లు అర్జున్‌కు షాకిచ్చిన బాలీవుడ్ బ్యూటీ
ఈ ఏడాది ప్రారంభంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత అతడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'పుష్ప' గురించి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది.
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌ను పెడుతున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో నర్తించేందుకు పలానా హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని సంప్రదించిందట. అయితే, దీని కోసం ఆమె ఏకంగా కోటిన్నర రూపాయలను డిమాండ్ చేసిందని తెలిసింది. నాలుగు నిమిషాల పాట కోసం అంత ఖర్చు పెట్టడం వృథా అని భావించిన దర్శక నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేశారని సమాచారం.

దిశా పటానీని వద్దనుకున్న తర్వాత మరో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాను ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి నటించాల్సి ఉన్నా.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతోంది.


Click it and Unblock the Notifications











