500 రూపాయలతో ముంబైకి.. కోట్లాది ఆస్తులతో టాప్ రేంజ్‌కి.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?
జీవితం వైకుంఠపాళి లాంటిది.. ఇక్కడ ఎవరు ఎప్పుడు నిచ్చెన ఎక్కుతారో? ఎవరిని పాము మింగేస్తుందో ఎవరికీ తెలియదు. భూమ్మీద ఉన్నన్ని రోజులూ పోరాడాల్సిందే. రేసులో నిలబడిన వారే విజేతలుగా నిలుస్తారు. ప్రస్తుతం సినీ రంగంలో స్టార్స్‌గా, సూపర్‌స్టార్స్‌గా వెలుగొందుతున్న వారికి ఈ జీవితం ఊరికే రాలేదు.. దీని వెనుక ఎన్నో అవమానాలు, నిద్రలేని రాత్రులు, పస్తులున్న రోజులు ఎన్నో ఉంటాయి. అన్నింటిని దాటుకుని నిలబడి నేడు దేశం గర్వించే నటులుగా నిలిచారు. చేతిలో 500 రూపాయలు పట్టుకుని ముంబై మహానగరానికి బయల్దేరిన ఓ యువతి నేడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు. ఆమె ఎవరు? ఎలాంటి కష్టాలు పడింది? ఈ వివరాలు చూస్తే..
చదువు మధ్యలోనే మానేసి మోడల్‌గా
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. దిశా పటానీ. 13 జూన్ 1992న ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జన్మించారు దిశా. ఈమె కుటుంబం ఎప్పటి నుంచో దేశానికి సేవ చేస్తోంది. తండ్రి పోలీస్ ఆఫీసర్ కాగా.. ఆమె అక్క ఖుష్బూ పటానీ భారత సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దిశకు తమ్ముడు సూర్యాంశ్ పటానీ ఉన్నాడు. లక్నో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెకండియర్‌లో ఉండగా చదువు మానేసి మోడలింగ్ వైపు అడుగులు వేశారు దిశా పటానీ. 2013లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్ కాంటెస్ట్‌లో దిశా పటానీ ఫస్ట్ రన్నర్‌గా నిలిచారు.

లోఫర్‌తో సినీ ప్రస్థానం
2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ ఆమెకు నటిగా తొలి చిత్రం. ఇందులో వరుణ్ తేజ్ సరసన నటించే అవకాశం దిశకు దక్కింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఈమె అంద చందాలు, వైట్ స్కిన్ టోన్ కుర్రాళ్లను పిచ్చెక్చించింది. టాలీవుడ్‌లో అదృష్టం కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు దిశా పటానీ. వెల్‌కం టూ న్యూయార్క్, బాఘీ 2, భరత్, మలాంగ్, బాఘీ 3, రాధే, ఏక్ విలన్ రిటర్న్స్, యోధ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా దూసుకొచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీలో అతిథి పాత్రలో కనిపించారు దిశ. ప్రస్తుతం వెల్‌కమ్ టూ ది జంగీల్, హోలీగార్డ్స్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు.
500 రూపాయలతో ముంబైకి
అయితే ఈ స్టార్‌డమ్, ఈ పేరు ప్రఖ్యాతులు దిశా పటానీకి అంత తేలిగ్గా దొరకలేదు. కేవలం 500 రూపాయలు చేతిలో పెట్టుకుని ముంబై రైలు ఎక్కేశారు. గాడ్ ఫాదర్ లేకుండా సినీ పరిశ్రమలో నెగ్గుకు రావడం కష్టమేనని తెలిసినా తన ప్రతిభపై నమ్మకంతో కష్టాలకు ఎదురు నిలిచింది దిశా పటానీ. చేతిలో డబ్బులన్నీ అయిపోగా.. ప్రతిరోజూ ఆడిషన్స్‌కు వెళ్లేదాన్నని.. టెలివిజన్‌లో వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు ఎక్కువగా ట్రై చేసినట్లు దిశా పటానీ గుర్తుచేసుకున్నారు. ఇంటి అద్దె కట్టడానికి చేతిలో డబ్బు లేకపోవడం, కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎంతో బాధపడినట్లు ఆమె తెలిపారు. కష్టపడి మోడల్‌గా మారి.. అటు నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు.
100 కోట్లకు పైగా ఆస్తులు
500 రూపాయలతో జీవితం ప్రారంభించిన దిశా పటానీ నేడు నెలకు కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు వాణిజ్య ప్రకటనల్లో నటించినందుకు కూడా కోట్లలోనే వసూలు చేస్తున్నారు దిశా పటానీ. ముంబైలో రూ.5 కోట్ల విలువైన ఫ్లాట్.. బెంజ్, ల్యాండ్ రోవర్, ఆడీ, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు ఆమె సొంతం. దిశా పటానీ ఆస్తుల విలువ రూ.100 కోట్ల పైనే ఉంటుందని బీటౌన్ టాక్. కష్టాలకు కృంగిపోకుండా.. పట్టుదలతో శ్రమిస్తే ఏనాటికైనా విజయం వరిస్తుందని దిశాపటానీ లైఫ్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











