44 సినిమాలకు డైరెక్షన్.. నటిగా 200 సినిమాలు.. నిర్మాతగా 15 పిక్చర్స్.. గుర్తింపు దక్కని సినీ తార ఎవరో తెలుసా?
తెలుగు సినిమా రంగంలో నటీనటులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదనే విమర్శ ఎప్పుడూ వినిపిస్తుంటుంది. ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణం రాజు, సావిత్రి, జమున, విజయ నిర్మల, రేలంగి, రాజబాబు ఇలాంటి ఎంతో మంది ప్రముఖులు కళామతల్లికి సేవలు చేశారు. అయితే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేకపోవడంపై పలు రకాల విమర్శలు వినిపించాయి. అయితే డైరెక్టర్‌గా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొన్న విజయనిర్మలకు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ అవార్డు గానీ, ఇతర అవార్డుల విషయంలో ఎలాంటి గుర్తింపు రాకపోవడం శోచనీయం. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా విజయ నిర్మల సాధించిన ఘనతలు గురించి ఓ సారి దృష్టి సారిస్తే..
విజయ నిర్మల 1950లోనే బాల నటిగా తమిళంలో మచా రేఖై అనే సినిమాతో కెరీర్ ఆరంభించారు. తెలుగులో 1957 సంవత్సరంలో పాండు రంగ మహత్యం, 1958లో భూకైలాస్, కన్నడలో భార్గవి నిలయం సినిమాలతో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత మీనా చిత్రంతో 1973లో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత ఆమె నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తన కంటూ గుర్తింపును, ఖ్యాతిని సంపాదించుకొన్నారు.

దక్షిణాది సినిమా రంగంలో అంటే తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు భాషల్లో 46 సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆమె 200 సినిమాల్లోకి పైగా నటిగా నటించారు. నిర్మాతగా 15 సినిమాలకుపైగా నిర్మించారు. తెలుగులో 40 సినిమాలు, కన్నడలో రెండు, మలయాళంలో 1, తమిళంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ కూడా సాధించిన విధంగా 44 చిత్రాలను డైరెక్ట్ చేసి ఏకైక మహిళా దర్శకురాలిగా రికార్డు క్రియేట్ చేశారు.
విజయ నిర్మల జీవిత భాగస్వామి సూపర్ స్టార్ కృష్ణతో తొలిసారి 1967 సంవత్సరంలో సాక్షి అనే చిత్రంలో కలిసి నటించారు. కృష్ణతో కలిసి ఆమె సుమారుగా 40 చిత్రాల్లో నటించారు. అప్పట్లో వారిద్దరి జంట హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందింది. వారిద్దరు కలిసి నటించిన చిత్రాలు ఘనవిజయాలు సాధించాయి. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగస్వామిగా నిలిచారు.

అయితే ఇలాంటి మహోన్నతమైన రికార్డు కలిగిన విజయ నిర్మలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తారు. ప్రతీ ఏటా పద్మ అవార్డులు ప్రకటించినప్పుడు ఏదైనా అవార్డు వస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగులుతుంది. వచ్చే ఏడాదైనా ఆమె సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డుకు నోచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.
ఇటీవల విజయ నిర్మల కుమారుడు, నటుడు, నిర్మాత వీకే నరేష్ మాట్లాడుతూ.. నా తల్లిగా కాకుండా నటిగా, దర్శకురాలిగా తనకు సరైన గుర్తింపు రాలేదు. కొన్నిసార్లు నేను స్వయంగా పద్మ అవార్డు కోసం సిఫారసు చేశాను. కానీ అక్కడ కొన్ని శక్తులు వ్యతిరేకంగా ప్రయత్నించాయి. గతేడాది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అమ్మగారి కోసం పద్మ ఇవ్వాలని సిఫారసు చేశారు. కానీ ఫలితం శూన్యం. ఈ సారి ఆమెకు పద్మ అవార్డు ఇవ్వాలని.. అవసరమైతే నిరాహార దీక్షకు సైతం కూర్చొంటానని నరేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయ నిర్మల గారికి అత్యున్నత గుర్తింపు లభించాలని ఫిల్మీబీట్ కోరుకొంటున్నది.


Click it and Unblock the Notifications











