రెండేళ్ల గ్యాప్.. మళ్ళీ మొదలు పెట్టిన శృతి హాసన్!
సౌత్ స్టార్ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. శృతి హాసన్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చింది. తెలుగులో శృతి హాసన్ గబ్బర్ సింగ్, ఎవడు, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. దీనితో తెలుగు తమిళ భాషల్లో శృతి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఆ తర్వాత శృతి హాసన్ కు కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి. శృతి హాసన్ 2017లో సింగం 3, కాటమరాయుడు, బెహెన్ హోగీ తేరి లాంటి చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల తర్వాత శృతి హాసన్ ఇప్పటి వరకు మరో చిత్రంలో నటించలేదు.
ఎట్టకేలకు శృతి హాసన్ తన కొత్త చిత్రాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయ్ సేతుపతి సరసన శుభం అనే చిత్రంలో శృతి హాసన్ నటించడానికి అంగీకరించింది. ఈ చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలని శృతి హాసన్ ట్విట్టర్ లో షేర్ చేసింది. నా అభిమాన నటులలో ఒకరైన విజయ్ సేతుపతితో నటించనుండడం సంతోషంగా ఉంది అంటూ కామెంట్ పెట్టింది.

ఈ చిత్రానికి జననాథన్ దర్శకుడు. పాజిటివ్ గా, సరదాగా ఈ చిత్రంలో నటించబోతున్నాను అని శృతి హాసన్ తెలిపింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ కు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











