నిన్న నిధి అగర్వాల్.. నేడు సమంత.. హద్దు మీరిన అభిమానులతో చేదు అనుభవం
ఇటీవలి కాలంలో సినీ సెలబ్రిటీలపై అభిమానాన్ని వ్యక్తం చేసే తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. అభిమానం అనే పేరు మీద కొందరు ఆకతాయిలు హద్దులు దాటి ప్రవర్తించడం ఇబ్బందికరంగా మారింది. కొంతమంది హద్దు మీరిన ప్రవర్తన వల్ల తారలు ఎదుర్కొంటున్నారు. ఈ తీరు సమాజం మొత్తాన్ని ఆలోచింపజేస్తున్నాయి. సెలబ్రిటీలపై అభిమానుల ప్రవర్తన చర్చనీయంగా మారింది. అభిమానుల వల్ల నిన్న నిధి అగర్వాల్ చేదు అనుభవం ఎదుర్కొనగా.. తాజాగా అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ( Samantha Ruth Prabhu) కు అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అసలేం జరిగిందంటే..?
హీరో సమంత ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ ప్రాంతంలో ఉన్న సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో పాటు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమంతను చూడాలనే ఉత్సాహంతో జనం ముందే పెద్ద ఎత్తున గుమిగూడారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సమంత బయటకు వచ్చి తన కారు వైపు వెళ్లే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో అభిమానులు హద్దు మీరారు.

సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడడంతో తోపులాట వాతావరణం నెలకొంది. కొందరు అత్యుత్సాహంతో సమంత అతి దగ్గరగా వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయడంతో ఆమెకు నడవడం కూడా కష్టంగా మారింది. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా జనాన్ని నియంత్రించడం సాధ్యపడలేదు. చివరకు వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి, హీరోయిన్ సమంతను జనాల మధ్య నుంచి తప్పించి కారులో కూర్చోబెట్టారు. ఈ గందరగోళం మధ్యన కూడా సమంత సహనం కోల్పోకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదే తరహా సంఘటన గత వారం హైదరాబాద్ కూకట్‌పల్లిలో చోటుచేసుకుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' సినిమా పాట విడుదల కార్యక్రమాన్ని లులు మాల్‌లో నిర్వహించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈవెంట్ ముగిసిన అనంతరం నిధి అగర్వాల్ బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా జనం ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం తోసుకుంటూ ముందుకు వచ్చారు. అంతే కాకుండా ఆమెను తాకే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఆమె తీవ్ర అసహనానికి, భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి.
ఈ ఘటనపై కేపీహెచ్‌బీ పోలీసులు సీరియస్‌గా స్పందించారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించారని, సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని లులు మాల్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులపై సుమోటోగా కేసు నమోదు చేశారు. సెలబ్రిటీల భద్రత విషయంలో నిర్వాహకులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఇలా వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అభిమానం ఉండొచ్చు కానీ.. కనీస మర్యాద లేకుండా ప్రవర్తించడం సరికాదు', 'సెలబ్రిటీలకు కూడా ప్రైవసీ ఉంటుంది'అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.


Click it and Unblock the Notifications











