‘అత్యాచారంతో నా జీవితం నాశనం.. ఆ మోసగాడికేమో టాప్ పొజిషన్’
చిత్ర పరిశ్రమలో అవకాశాల పేరుతో మహిళా నటుల్ని వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు పెద్ద మనుషులు. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో దశాబ్ధాలుగా దారుణాలకు పాల్పడుతున్నారు. భారతదేశంలో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన రోజుల్లో పలువురు నటీమణులు తమపై జరిగిన దారుణాలను బయటపెట్టి కలకలం రేపారు. ఇలాంటి వారిలో గాయత్రీ గుప్తా కూడా ఒకరు. ఇండస్ట్రీలోని కొందరు పెద్ద మనుషులు తనను అవకాశాల పేరుతో వాడుకున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి. తాజాగా గాయత్రీ గుప్తా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే...
గాయత్రీ గుప్తాకు చిన్నప్పటి నుంచి సినిమాలలో నటించడం అంటే పిచ్చి. దానిపై ఆసక్తితోనే తొలుత షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ అనంతరం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం తదితర చిత్రాలలో నటించింది. సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనే ఆమె ఎక్కువ పేరు సంపాదించింది. ఇక తాను అనారోగ్యంతో బాధపడతున్నానని సాయం చేయాలంటూ షాకిచ్చింది.

చిన్నప్పటి నుంచి తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. కన్న తండ్రే నా తల్లిని, నన్ను చిత్రహింసలకు గురిచేసేవాడని.. కరెంట్ వైర్‌తో మా ఇద్దరినీ చావగొట్టి గాయాలపై కారంపొడి చల్లేవాడని, కళ్లలో నిమ్మరసం పిండేవాడని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టాక అవకాశం కావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని ముఖం మీదే అడిగేవారని గాయత్రి వ్యాఖ్యానించింది. తనపై ఎన్నిసార్లు అత్యాచారం జరిగిందో లెక్కలేదని.. ఓ పార్టీలో నేను తాగిన మత్తులో ఉండగా ఓ నిర్మాత తన డ్రెస్ లాగేసి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపించింది. బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొనే అవకాశం వచ్చిందని.. కానీ బిగ్‌బాస్ నిర్వాహకులు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడగటంతో తప్పుకున్నానని గాయత్రి పేర్కొంది.
కాగా.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్‌లు లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ చిత్రం .. డిఫరెంట్ లవ్ స్టోరీగా గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. ఈ సినిమాను వీక్షించిన గాయత్రీ గుప్తా.. ది గర్ల్ ఫ్రెండ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది.
రెండు రోజులవుతోంది ది గర్ల్ ఫ్రెండ్ మూవీ చూసి.. సినిమా చూసినంతసేపు తట్టుకోలేకపోయా. సినిమా అయిపోయాక కూడా ఇప్పటికీ దానిలో నుంచి బయటకు రాలేకపోయా. నా జీవితంలో జరిగిన ట్రామాలో 5 శాతాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అదే నన్ను చాలా ట్రిగ్గర్ చేసేసింది. నన్ను నేను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. నాకెం కాలేదు, నేను బాగానే ఉన్నా. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్యూ.. చిన్మయి గారు, రాహుల్ రవీంద్ర గారు. ఇలాంటి సినిమాలే ఇప్పుడు సోసైటీ ఎంతో అవసరం. అయితే నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ క్రూలో ఓ ద్రోహి ఉన్నాడు. ఎవరైతే నా మీద రేప్ అటాక్ చేశాడో.. అతను మీ టీమ్‌లో ఓ మంచి పోజిషన్‌లో ఉన్నాడు. కానీ సరైన సాక్ష్యాధారాలు లేక ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా. కానీ ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు.
బాధను, కోపాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌తో ఐసోలేషన్‌లో ఉండిపోయా.. ఎవ్వరి నుంచి నాకు సపోర్ట్ లేదు. 15 ఏళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉంటున్నా నేను ఎవ్వరికీ తెలియదు. నాకు ఈ పరిస్ధితి తీసుకొచ్చిన మీ క్రూలో ఆ వ్యక్తి మాత్రం మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నాడు. ఇండస్ట్రీ నాకు అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టడానికి కూడా అతనే కారణం. నా బాధను మీతో చెప్పుకునే అవకాశం ఇస్తే వాస్తవాలు చెబుతానని చిన్మయి, రాహుల్ రవీంద్రన్‌లను గాయత్రి గుప్తా అభ్యర్ధించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుండగా.. ఇంతకీ ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











