ఆ పరిస్థితిలో చిరంజీవి సహాయం..హేమ ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, తోటి నటీనటులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి అనడంలో అతిశయోక్తి కాదు. టాలీవుడ్ లో పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వరకు ఎందరికో మెగాస్టార్ సాయం చేశారు. తాజాగా సీనియర్ నటి,క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ హేమ.. తాను కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనకు మెగాస్టార్ చిరంజీవి సహాయం చేశారని ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది?

దాదాపు రెండేళ్ల క్రితం బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ కేసులో కొంతమంది తెలుగు వ్యక్తుల పేర్లు వినిపించడంతో పాటు సీనియర్ నటి హేమ పేరు కూడా బయటకు రావడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే అనంతరం కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆ వివాదం క్రమంగా ముగిసిపోయింది. అయితే.. తాజాగా నటి హేమ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన డ్రగ్స్ కేసులో ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.

Hema Gets Emotional on Chiranjeevi s Support During Crisis Slams Media Over Case

డ్రగ్స్ కేసు విషయంలో నిజాలు బయటకు రాకముందే తనపై తప్పుగా ప్రచారం జరిగిందని, తాను ఏ తప్పూ చేయకపోయినా మీడియాలో తనను నిందితురాలిగా చూపించారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో ఉన్నాను... నాకు సంబంధించిన విషయం అందరికీ తెలుసు. అయినా కూడా నన్ను తెలిసిన వాళ్లే ఇలా రాయడం బాధగా ఉంది'అని హేమ అన్నారు. తనకు కూడా కుటుంబం ఉందని, వారి భావాలను కూడా గుర్తించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని పేర్కొన్నారు. ఏ విషయం అయినా పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాతే ప్రచారం చేయాలని, లేకపోతే అది వ్యక్తుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆమె సూచించారు.

ఈ కేసు సమయంలో తాను ఎంత మానసికంగా కుంగిపోయానో కూడా హేమ వివరించారు. 'నన్ను నడిరోడ్డుపైకి లాగేశారు. నేను ఎన్నిసార్లు ఏ తప్పు చేయలేదని చెప్పినా ఎవ్వరూ వినలేదు. నా ఇంటి నుంచే వీడియోలు పెట్టినా నమ్మలేదు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. మా అమ్మను కూడా ఈ విషయానికి లాగారు. ఆ పరిస్థితుల్లో చనిపోవాలనిపించింది. కానీ నా అమ్మ నన్ను నిలబెట్టింది' అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన కేసు నవంబర్ 4న కోర్టులో కొట్టివేయబడిన విషయాన్ని గుర్తు చేస్తూ, 'ఆ విషయాన్ని నేనే అందరికీ పంపించాను. కానీ అప్పట్లో వచ్చిన వార్తల మాదిరిగా ఎవరూ స్పందించలేదు. అదే నన్ను ఇంకా బాధించింది' అని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు పెద్దగా ప్రచారం చేసి, నిర్దోషిగా తేలినప్పుడు మౌనం వహించడం సరికాదని మీడియాపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మా అసోసియేషన్ నుంచి మీకు సపోర్ట్ వచ్చిందా?అనే ప్రశ్నకు హేమ స్పందిస్తూ..'నాకు మా అసోసియేషన్ నుంచి కచ్చితంగా పూర్తి సపోర్ట్ వచ్చింది'అని స్పష్టంగా చెప్పారు. కష్ట సమయంలో ఒంటరిగా వదిలేయకుండా నిలబెట్టిన వారు ఉన్నారనే విషయాన్ని ఆమె ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి మాట్లాడుతూ, ఆయన చేసిన సహాయాన్ని ఎంతో కృతజ్ఞతతో గుర్తుచేశారు. 'చిరంజీవి గారు వ్యక్తిగతంగా రాకపోయినా, ఆయన తరఫున తన మనుషులను పంపించారు. నాకు ఏం అవసరమో తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా సహాయం చేశారు. ఆ సమయంలో నాకు అండగా నిలిచారు'అని తెలిపారు.

ఆ క్లిష్ట సమయంలో ఆయన నుంచి వచ్చిన ఆ మద్దతు తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని అన్నారు. అంతేకాకుండా, 'చిరంజీవి గారు తన సినిమాల్లో నాకు అవకాశం ఇస్తానని కూడా మాట ఇచ్చారు' అని చెప్పడంతో, ఆమె మాటల్లో ఆభిమానంతో పాటు కృతజ్ఞత కూడా స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి తాను ఎవరికి కూడా ఫోన్ చేయలేదనీ, ఎవరి సహాయం కూడా అడగలేదనీ. అయినా కూడా వాళ్లు స్వయంగా వచ్చి నన్ను ఆదుకున్నారని తెలిపారు.

ఇక ఈ సంఘటనలో అసోసియేషన్ వ్యవహారం గురించి కూడా ఆమె స్పందించారు. మొదట తన సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, 'జడ్జిమెంట్ రాకముందే ఎలా నా సభ్యత్వాన్ని తీసేస్తారు అని ప్రశ్నించాను. తర్వాత వారం రోజుల్లో మళ్లీ ఇచ్చారు'అని తెలిపారు. అలాగే ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా తన విషయాన్ని ప్రస్తావించారని, ఇండస్ట్రీ నుంచి తనకు పూర్తి మద్దతు ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా హేమ, లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ రావును గుర్తు చేసుకున్నారు. 'ఇండస్ట్రీలో దాసరి గారు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది' అంటూ పెద్దల మార్గదర్శకం ఎంత అవసరమో ఈ సంఘటన తెలియజేసిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X