భర్తతో హీరోయిన్ ఆసిన్ డిన్నర్ డేట్.. 40 ఏళ్ల వయసులో 20 ఏళ్ల అమ్మాయిలా గ్లామర్.. ఫోటోలు ట్రెండింగ్
సినిమా ఇండస్ట్రీలో అభద్రతాభావం ఎక్కువగా ఉండటంతో తారలు తమ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పుడే లైఫ్‌ను బెటర్‌గా ప్లాన్ చేసుకొంటారు. భవిష్యత్‌లో ఎలాంటి కష్టాలు పడకుండా సురక్షితమైన జాగ్రత్తలు తీసుకొని జీవితాన్ని చక్కగా డిజైన్ చేసుకొంటారు. అలాంటి తారల కోవలో 2000 సంవత్సరంలో హీరోయిన్‌గా రాణించడమే కాకుండా దక్షిణాది, హిందీలో అగ్రతారగా రాణించిన ఆసిన్ తొట్టంకాల్ (Asin) కూడా ఒకరు. బాలీవుడ్‌లోను, దక్షిణాది సినిమా పరిశ్రమలోను అగ్ర హీరోయిన్‌గా ఉన్నప్పుడే దాంపత్య జీవితాన్ని ఎంచుకొన్నారు. అయితే అప్పటి నుంచి మీడియాకు కనిపించకుండా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఆమె తన భర్తతో డిన్నర్ డేట్‌కు వెళ్లిన ఫోటో బయటకు రావడం.. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆసిన్ అందచందాలు, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆమె భర్త ఎవరు అనే వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొచీలో జన్మించిన ఆసిన్ గ్లామర్ ప్రపంచంపై మమకారం పెంచుకొని మోడల్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. తొలుత మలయాళ భాషలో నరేంద్రన్ మకన్ జయకాంత్ వాకా అనే సినిమా ద్వారా 2001 సంవత్సరంలో సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన అమ్మనాన్న తమిళ అమ్మాయి సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోకి 2003 సంవత్సరంలో ప్రవేశించారు. ఆ సినిమా హిట్ కావడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వెతుక్కొంటూ వచ్చాయి.

తెలుగులో నాగార్జున అక్కినేని సరసన శివమణి, బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ, వెంకటేష్‌తో ఘర్షణ, ప్రభాస్‌తో చక్రం చిత్రాల్లో నటించింది. ఆ సమయంలో మలయాళం, తమిళం భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. తమిళంలో గజిని, శివకాశి, వరలారు, పోకిరి చిత్రాలు హిట్ కావడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ రివ్వును పైకి ఎగిరింది. 2008 సంవత్సరంలో హిందీలో గజినీ చిత్రంలో నటించి అక్కడ కూడా సక్సెస్ అందుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో లండన్ డ్రీమ్స్, రెడీ, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం ఆల్ ఈజ్ వెల్.

బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సమయంలో మాక్రో మ్యాక్స్ మొబైల్ సంస్థ అధినేత రాహుల్ శర్మతో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ వ్యవహారం ముదరడంతో జనవరి 2016 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. వారిద్దరూ క్రిస్టియన్, హిందూ మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకొన్నారు. ఆ తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పారు. వారికి ఓ కూతురు ఉన్నారు. ప్రస్తుతం ఆమె దాంపత్య, వ్యాపార జీవితానికే పరిమితమయ్యారు.
ఇలా మీడియాకు, గ్లామర్ ప్రపంచానికి దూరమైన ఆసిన్.. ఎన్నడూ కూడా సినిమా వేడుకల్లో కనిపించలేదు. కానీ ఇటీవల తమ మ్యారేజ్ డే సందర్భంగా ఆసిన్, రాహుల్ శర్మ డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆసిన్‌తో ఉన్న ఫోటోను రాహుల్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. దాంతో ఆ ఫోటో వైరల్ కావడంతో ఆసిన్ గ్లామర్ చర్చనీయాంశమైంది. 10, 15 ఏళ్ల క్రితం ఎలా ఉందో.. ఇప్పటికీ ఆమె అలాగే ఉండటం, అదే అందాన్ని మెయింటెన్ చేయడంపై నెటిజన్లు, ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











