IPL 2025: ఐపీఎల్ ద్వారా ప్రీతి జింటాకు భారీ లాభాలు.. ఎన్ని వందల కోట్లో తెలుసా?
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ ప్రేమికులను అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. ప్రతిక్షణం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 6 పరుగుల స్వల్ప తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు దాదాపు 18 ఏళ్లుగా టైటిల్ కోసం కాళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోన్న బెంగళూరు జట్టు కప్ అందుకుంది. ఫైనల్‌లో చివరి వరకు పోరాడినా కప్ చేజారిపోవడంతో పంజాబ్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.
లాభాల మదింపులో యాజమాన్యాలు
ఐపీఎల్ ముగియడంతో బీసీసీఐ సహా అన్ని జట్లు తమ లాభనష్టాల అంచనాలను మొదలుపెట్టాయి. టికెట్ల అమ్మకాలు, ప్రసార హక్కులు, వాణిజ్య ప్రకటనలు, స్పాన్సర్‌షిప్ ఇలా ఎన్నో అంశాల్లో ఐపీఎల్ కనక వర్షం కురిపిస్తోంది. కేవలం జట్లకే కాదు ఆటగాళ్లకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. అందుకే ప్రపంచంలోని ప్రతి ఒక్క క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడాలని అనుకుంటున్నాడు. ఐపీఎల్‌లో బడా వ్యాపారవేత్తలతో పాటు షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా వంటి స్టార్స్ కూడా యజమానులేనన్న సంగతి తెలిసిందే. వీరు కూడా భారీగా లాభాలను అందుకుంటున్నారు.

జట్టును ఉత్సాహపరిచే ప్రీతి జింటా
ఈ ఐపీఎల్ ఫైనల్‌లో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమానిగా ఉన్న ప్రీతి జింటా ఈసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ప్రతిరోజూ స్టేడియానికి వస్తూ జట్టు ఓడినా, గెలిచినా స్టాండ్స్‌లో నిలబడి ఎంకరేజ్ చేస్తుంటారు ప్రీతి. క్రికెటర్లకు ఆమె ఇచ్చే ముద్దులు, హగ్గుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలుమార్లు వివాదాస్పదమైనప్పటికీ ప్రీతి మాత్రం తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు. గ్రౌండ్‌లో అలాగే సందడి చేస్తూనే వచ్చింది.
పంజాబ్ జట్టుపై కోర్టుకెక్కిన ప్రీతి జింటా
జట్టు ప్లే ఆఫ్స్‌కి వెళ్లిన సమయంలో పంజాబ్ యాజమాన్యంపై ప్రీతి జింటా కోర్టుకెక్కడం కలకలం రేపింది. నిబంధనలకు విరుద్ధంగా బోర్డు సమావేశం నిర్వహించడంతో పాటు చట్ట విరుద్ధంగా మునీష్ ఖన్నా అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రీతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ మాతృసంస్థ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాలను ఆమె ప్రతివాదులుగా చేర్చారు.
పంజాబ్ జట్టుపై రూ.35 కోట్ల పెట్టుబడి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిని ప్రీతి జింటా ఈ క్రమంలో నెస్ వాడియాతో డేటింగ్ చేశారు. రేపో మాపో పెళ్లి ఖాయం అనుకున్న సమయంలో ఈ జంట విడిపోవడం సినీ, కార్పోరేట్ వర్గాలకు షాకిచ్చింది. అప్పటికే పంజాబ్ కింగ్స్‌లో ప్రీతి జింటాకు భాగస్వామ్యం కల్పించారు నెస్‌వాడియా. బ్రేకప్ తర్వాత అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లాడిన ప్రీతి జింటా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడింది. అయినప్పటికీ నెస్ వాడియాతో ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తూనే వచ్చిన ప్రీతి జింటా ఐపీఎల్‌లో ఇప్పటి వరకు దాదాపు రూ.35 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లుగా బాలీవుడ్ టాక్. ప్రతి ఐపీఎల్‌కు ఇండియా వచ్చి జట్టుకు మద్ధతు తెలుపుతూ స్టాండ్స్‌లో సందడి చేస్తుంటారు.
భారీగా పెరిగిన ప్రీతి ఆస్తులు
ఇక ఐపీఎల్‌లో టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్‌షిప్, వాణిజ్య ప్రకటనల్లో వాటా ద్వారా ఏకంగా రూ.350 కోట్లకు పైగా ప్రీతి జింటా సంపాదించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె నికర ఆస్తుల విలువ కూడా భారీగా పెరిగినట్లుగా బీటౌన్ మీడియా కోడై కూస్తోంది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రదేశాలలో ఒకటైన పాలి హిల్స్‌లో రూ.18 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, స్వస్థలం సిమ్లాలో రూ.7 కోట్ల విలువైన భవంతి, లాస్ ఏంజెల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











