Samantha: పేరు మార్చుకొంటున్న సమంత.. కొత్త పేరేంటో తెలుసా?
అందాల తార సమంత రుత్ ప్రభు కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తాను చాటుతున్నారు. ఇటీవల సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టి.. మొదటి ప్రయత్నంలోనే ఆమె మంచి విజయాన్ని అందుకొన్నారు. ఆంతేకాకుండా తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించారు. గత కొద్దికాలంగా అనేక ఒడి దుడుకులకు లోనైన ఆమె వ్యక్తిగత జీవితం ఇప్పడిప్పుడే గాడిన పడుతున్నది. అయితే లైఫ్‌లో చిగురిస్తున్న కొత్త ఆశలతోపాటు సరికొత్త జీవితాన్ని ఆస్వాదించేందుకు సిద్దమవుతున్నారనే విషయం ఆసక్తిని కలుగజేస్తున్నది. అయితే సమంత తన పేరును మార్చుకోబోతున్నారనే వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నది. ఆమె పేరు మార్పు వెనుక అసలు కారణం ఏమిటంటే?
సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అక్కినేని నాగచైతన్యతో లవ్ జర్నీ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవడం తెలిసిందే. అనంతరం ఆమె తన పేరును సమంత రుత్ ప్రభు నుంచి సమంత అక్కినేనిగా మార్చుకొన్నారు. తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా అధికారికంగా ప్రకటించకుొన్నారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి మెలసి ఉన్నట్టు కనిపించినా అనూహ్యంగా వారిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తన పేరు నుంచి అక్కినేని అనే పదాన్ని తొలగించాల్సి వచ్చింది.

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రుత్ ప్రభు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి బంధాన్ని కొనసాగించారు. చాలా సుదీర్ఘంగా సాగిన వారి ప్రేమ ప్రయాణానికి పెళ్లి రూపంలో ముగింపు పలికారు. రాజ్, సమంత ఇద్దరు తమ దాంపత్య జీవితాన్ని కాకుండా ప్రొఫెషనల్ లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. వారిద్దరి భాగస్వామ్యంలో మరో సినిమా కూడా రిలీజ్‌కు సిద్దమవుతున్నది.
ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే ఫ్యామిలీ, యాక్షన్, డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తనలోని మరో కోణాన్ని సమంత ఆవిష్కరించుకొనే పనిలో ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమా ద్వారా తన పేరును మార్చుకోబోతున్నారు అనే వార్త మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నది.
మా ఇంటి బంగారం సినిమా టైటిల్‌లో సమంత తన పేరును సమంత నిడిమోరుగా మార్చుకోబోతున్నారు అనే విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త రాజ్ నిడిమోరు ఇంటి పేరును తన పేరుతో జోడించుకోవడంలో తప్పేమీ లేదు అని సినీ వర్గాలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే నిజంగానే సమంత పేరు మార్చుకొంటుందా? లేదా అనేది సినిమా రిలీజ్ అయితే గానీ అసలు విషయం బయటకు రాదని అంటున్నారు.
ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. సమంత తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మాతలుగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం, ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫిని, ధర్మేంద్ర కకరాల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. లీ విటాకేర్ యాక్షన్ డైరెక్టర్ యాక్షన్ కొరియోగ్రఫిని అందిస్తున్నారు


Click it and Unblock the Notifications











