ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే.. ఆ విషయాన్ని పట్టించుకోను..: జూనియర్ సిల్క్ స్మిత
Junior Silksmitha: వెండితెరపై ఒకప్పుడు తన అందం, చూపులు, నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న శృంగార తార సిల్క్ స్మిత ( Silksmitha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె లేని లోటు ఇప్పటికీ ప్రేక్షకుల్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే సిల్క్ స్మిత ఇప్పుడు లేరన్న నిజం అందరికీ తెలిసినా... ఆమె పోలికలతో మరో నటీమణి ప్రేక్షకుల ముందుకు రావడం మాత్రం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అచ్చుగుద్దినట్లుగా సిల్క్ స్మితను పోలి ఉండే ఈ యువతి పేరు విష్ణుప్రియ (Vishnupriya). సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఆమెను ఇప్పుడు అందరూ 'జూనియర్ సిల్క్ స్మిత'గా పిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి టౌన్‌కు చెందిన విష్ణుప్రియ ముఖ కవళికలు, హావభావాలు చూసిన వారందరికీ సిల్క్ స్మితే గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు వ్యాంప్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్, కాస్త బోల్డ్ రొమాన్స్‌తో కూడిన పాత్రల్లో సిల్క్ స్మిత ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లే, ఇప్పుడు విష్ణుప్రియ కూడా అలాంటి పాత్రలతోనే గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె తమిళం, తెలుగులో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

తాజాగా జూనియర్ సిల్క్ స్మితగా గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నిన్ను చూసి సిల్క్ స్మిత గుర్తుకు వస్తుంది అని ఎవరైనా చెప్పారా?' అనే యాంకర్ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... ముందుగా తన ఇంట్లో వాళ్లే తనను అలా గుర్తించారని చెప్పింది. 'సిల్క్ స్మిత లో చనిపోయింది. నేను1997లో పుట్టాను. నువ్వు అచ్చం సిల్క్ స్మిత లాగానే ఉన్నావు అని ఇంట్లో వాళ్లు అనేవారు. కాలేజ్ రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ నన్ను చూసిన ప్రతి ఒక్కరూ అదే మాట అనేవారు. మొదట్లో సిల్క్ స్మిత పోలిక ఉందంటే భయపడేదాన్ని. కానీ ఆమె ఫేమ్, ఫాలోయింగ్ గురించి తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను' అని తెలిపింది.
తనకు వచ్చిన ఫేమ్ గురించి మాట్లాడుతూ... టిక్‌టాక్ ఆమె జీవితాన్ని ఎలా మార్చిందో వివరించింది. 'టిక్‌టాక్ వీడియోలు సరదాగా చేశాను. ఊహించని విధంగా అవి వైరల్ అయ్యాయి. సింగిల్ డిజిట్‌లో ఉన్న ఫాలోయింగ్ నెల రోజుల్లోనే 5 లక్షలకు చేరింది. నా ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు. యూట్యూబ్‌లో నాపై స్పెషల్ వీడియోలు చేశారు. కొందరు పేపర్లలో కూడా 'సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా?' అంటూ నాతో పోల్చుతూ వార్తలు రాశారు. గూగుల్‌లో సిల్క్ స్మిత అని కొడితే నా ఫోటోలు కనిపించడం చూసి నేనే ఆశ్చర్యపోయాను' అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.
ఇక టిక్‌టాక్ వీడియోలు సరదా కోసమా లేక యాక్టింగ్ మీద ఆసక్తితో చేశారా అనే ప్రశ్నకు... 'వీడియోలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ స్థాయిలో ఫేమ్ వస్తుందని ఊహించలేదు. ఇది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ప్రేక్షకుల ఆదరణ ఎవరికైనా కావాలి కదా. అవకాశాలు వస్తే తప్పకుండా సినిమాల్లో నటిస్తాను' అంటూ చెప్పుకొచ్చింది.
సిల్క్ స్మిత తరహాలో ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వస్తే చేస్తారా అని అడిగితే... విష్ణుప్రియ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. 'మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను. ఐటమ్ సాంగ్స్ అయినా, వ్యాంప్ పాత్రలైనా, కథకు సూట్ అయితే చేయడానికి సిద్ధమే. ఫలానా హీరోతోనే చేయాలి, ఫలానా డైరెక్టర్‌తోనే చేయాలి అనే పట్టింపులు నాకు లేవు. సాంగ్, సిచువేషన్ బాగుంటే చాలు' అంటూ తన ఓపెన్ గా వెల్లడించింది.
ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలతో కెరీర్ కొనసాగిస్తున్న జూనియర్ సిల్క్ స్మిత, మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఆమె, ఛాన్స్ వస్తే ఆయన సినిమాలో మసాలా సాంగ్ చేయడానికి కూడా రెడీ అన్న సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే... ఈ జూనియర్ సిల్క్ స్మితకు ఎప్పుడు పెద్ద డైరెక్టర్ నుంచి బ్రేక్ వస్తుంది? ఆమె సిల్క్ స్మిత స్థాయికి చేరుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











