దీపికా పదుకొణె బాటలో కాజల్ అగర్వాల్ .. అలా చేయలేనంటూ..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్టార్ హీరోయిన్ రోజుకు కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానంటూ పెట్టిన షరతు గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం వల్ల ఆమె కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్టు ప్రచారం జరిగింది. ఈ అంశంపై చర్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా దీపికకు పూర్తి మద్దతు ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి చర్చనీయంగా మారింది.
వివాదం ఎలా మొదలైంది?
దీపికాకు 2024 సెప్టెంబర్‌లో కుమార్తె దువా జన్మనిచ్చింది. ఆ తర్వాత దీపికా పదుకొణె రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానని నిర్మాతలకు షరతు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ కారణంగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్', అలాగే నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న 'కల్కి 2898 AD' సీక్వెల్ వంటి భారీ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయంలో కొంతమంది ఆమెకు సపోర్టు చేయగా మరింత కొంతమంది ఆమె వాదనను తప్పుబట్టారు.

ఈ ప్రచారంపై దీపిక పదుకొణె స్పందిస్తూ.. "చాలామంది స్టార్ హీరోలు ఎన్నో ఏళ్లుగా రోజుకు ఎనిమిది గంటలే పని చేస్తున్నారు. వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్ చేస్తారు. కానీ అదే విషయాన్ని ఒక మహిళ కోరితే ఎందుకు వార్త అవుతోంది?" అంటూ సినీ పరిశ్రమలోని ద్వంద్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీపికకు మద్దతు తెలిపిన ప్రముఖుల్లో కంగనా రనౌత్ కూడా ఉన్నారు. "దీపిక తన కష్టంతో ఆ స్థాయికి చేరుకుంది. ఒక తల్లిగా ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తానంటే అది ఆమె సంపాదించుకున్న హక్కు" అని కంగనా గతంలో వ్యాఖ్యానించారు.
ఇప్పుడు కాజల్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన మూవీ 'ది ఇండియా స్టోరీ' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పని గంటలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెళ్లి, పిల్లలు పుట్టక తన జీవితంలో ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని ఆమె చెప్పారు. "గతంలో నేను రాత్రింబవళ్లు పని చేసేదాన్ని. ఎన్ని గంటలు షూటింగ్ జరిగినా పట్టించుకునేదాన్ని కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. నాకు కుటుంబం ఉంది.. కొడుకు ఉన్నాడు. వాళ్ల కోసం సమయం కేటాయించడం కూడా నా బాధ్యతే" అని కాజల్ అన్నారు.
కేవలం అభిప్రాయం చెప్పడమే కాకుండా, ప్రస్తుతం తాను సినిమా ఒప్పందాల్లోనే పని గంటలకు సంబంధించిన ప్రత్యేక క్లాజ్ చేర్చిస్తున్నానని కాజల్ వెల్లడించారు. "రోజుకు ఎంతసేపు పని చేస్తానో ముందే కాంట్రాక్ట్‌లో రాస్తాను. ఆదివారాల్లో షూటింగ్‌కు హాజరుకానని స్పష్టంగా చెబుతాను. ఆ రోజంతా నా కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందులా 24 గంటలు పని చేసే పరిస్థితి లేదు" అని ఆమె స్పష్టం చేశారు.
దీపిక తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టు కాజల్ తెలిపింది. ఇది ఎలాంటి అసాధారణ డిమాండ్ కాదని అభిప్రాయపడ్డారు. "ఒక స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతాం. ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కావాలని అడగడం తప్పు కాదు. కార్పొరేట్ రంగంలో పని గంటలకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. మరి సినిమా పరిశ్రమలో మాత్రం ఎందుకు ఉండకూడదు?" అని ఆమె ప్రశ్నించారు. దీపికతో ప్రారంభమైన ఈ చర్చ ఇప్పుడు కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా బహిరంగ మద్దతు ఇవ్వడంతో, భవిష్యత్తులో మరికొంత మంది కూడా మద్దతు పలికే అవకాశముంది. మహిళా నటీమణుల పని గంటలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంశం ఇండస్ట్రీలో మరోసారి చర్చకు వచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications




