అభినందన్ వీరత్వం తగ్గించి మాట్లాడొద్దు, ప్రాణాలు లెక్కచేయని హీరో అతడు: కంగనా రనౌత్
పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ మరికొన్ని గంటల్లో ఇండియాకు తిరిగి రాబోతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఉన్న అభినందన్ మిగ్-21 యుద్ధ విమానం పాకిస్థాన్‌లో కూలిపోవడంతో పాక్ ఆర్మీకి బంధీగా పట్టుబడ్డ సంగతి తెలిసిందే.
అభినందన్ వర్దమాన్ విడుదలపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం మధ్యాహ్నం పాక్ పార్లమెంటులో ప్రకటన చేస్తూ.. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం అభినందన్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్నాను: కంగనా
అభినందన్ విడుదలపై పలువురు సినీ సెలబ్రిటీలు ఆనందం వ్యక్తం చేశారు. మన హీరో తిరిగి వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో స్టేటస్ అప్డేట్ చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ బాలీవుడ్ వెబ్ సైట్‌తో మాట్లాడుతూ.. అభినందన్ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

అభినందన్ గురించి అలాంటి మాటలు వద్దు, స్థాయి తగ్గించొద్దు
కొందరు అభినందన్ హీరోయిజంను చులకన చేసి మాట్లాడుతూ అతడి వీరత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం బాధ కలిగిస్తోందని కంగనా వ్యాఖ్యానించారు. మన వింగ్ కమాండర్ పాకిస్థాన్లో ల్యాండ్ అయినపుడు... తన ప్రాణాలను లెక్కచేయకుండా ముఖ్యమైన పత్రాలను మింగివేయడానికి ప్రయత్నించాడు, దేశ భద్రతే ముఖ్యంగా భావించాడని కంగనా తెలిపారు.

ప్రతి సైనికుడు ఇష్టంగా దేశ సేవ
ప్రతి సైనికుడు దేశానికి సేవ చేయడాన్ని ఇష్టంగా స్వీకరిస్తాడు. ఆర్మీలోకి వెళ్లే ముందే వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందో తెలిసే వెళతారు. తమ ప్రాణాలు లెక్క చేయకుండా వెళతారు కాబట్టే వారు నిజమైన హీరోలు. అందుకే వారు అత్యున్నతంగా గౌరవింపబడతారని కంగనా వ్యాఖ్యానించారు.

మన హీరోల రక్షణలో సేఫ్‌గా ఉన్నాం
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మనం మౌనంగా ఉండటమే మంచిది. దేశానికి ఏదైతే మంచి జరుగుతుందో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మన సైన్యం సిద్ధంగా ఉంది. మన హీరోలే మన రక్షకులు.. వారి చేతుల్లో మనం చాలా సేఫ్‌గా ఉంటాం. అభినందన్ రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని కంగనా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











