చారిత్రాత్మక చిత్రంలో కీర్తి సురేష్.. యువరాణి పాత్రలో!
మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అందరిని మెస్మరైజ్ చేసింది కీర్తి సురేష్. అంతకు ముందే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ మహానటి చిత్రంలో నటనలో మరో స్థాయికి చేరుకుంది. గత ఏడాది విడుదలైన ఉత్తమ చిత్రాలలో మహానటి ఒకటిగా నిలిచింది. గత ఏడాది కీర్తి సురేష్ సర్కార్, పందెం కోడి 2 లాంటి కమర్షియల్ చిత్రాల్లో కూడా మెరిసింది. కీర్తి సురేష్ ప్రతిభకు తగ్గట్లుగానే అద్భుతమైన అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి.
కీర్తి సురేష్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మణిరత్నం భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కించాలని భావిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ నవల మొదటి చోళ రాజు రాజరాజ చోళ చరిత్రకి సంబంధించినది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ యువరాణి కుందవాయ్ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల కోసం మణిరత్నం పలువురు స్టార్ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మణిరత్నం పలు సందర్భాల్లో తెలిపారు.


Click it and Unblock the Notifications











