టాలీవుడ్‌లో కొత్త సెంటిమెంట్.. ఆ హీరోయిన్ ఉంటే కాంట్రవర్సీయేనట!
చిత్ర పరిశ్రమలో విచిత్రమైన పరిస్ధితులు చోటు చేసుకుంటాయి. ఏ తప్పు చేయకపోయినా కొన్నిసార్లు నిందలు భరించాల్సి రావొచ్చు. ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్దితేనే ఎదుర్కొంటున్నారు హీరోయిన్ కేతిక శర్మ. ఎప్పుడో రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ మధ్యలో డౌన్‌ఫాల్ అయ్యింది. ఇప్పుడు ఒకటి అరా ఆఫర్లు వస్తూ తిరిగి కెరీర్ ట్రాక్‌లోకి వచ్చింది అనుకుంటున్న దశలో ఆమె గురించి ఓ రూమర్ ఫిలింనగర్‌లో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్‌తో టాలీవుడ్‌లోకి కేతిక శర్మ
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన తొలి చిత్రం రొమాంటిక్ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు కేతికా శర్మ. తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా, బ్రో చిత్రాల్లో నటించింది. అందం, లుక్స్ పరంగా ఎక్కడా ఫిర్యాదులు లేనప్పటికీ ఎందుకో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ట్రాక్ తప్పింది. దీంతో తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయి సోషల్ మీడియాలో ఫోటో షూట్స్ , వీడియోలు పోస్ట్ చేస్తూ కాలక్షేపం చేసింది కేతిక శర్మ.
కేతికకు వరుస అవకాశాలు
ఇక టాలీవుడ్‌లో తన కెరీర్ ముగిసింది అనుకుంటున్న టైంలో నితిన్ , శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్ హుడ్‌లో కేతిక శర్మ ఐటెం సాంగ్ చేశారు. తన అందాలు , వంపు సొంపులతో పాటు హాట్ హాట్ స్టెప్పులతో సర్‌ప్రైజ్ చేశారు కేతిక. ఈ సినిమాతో మేకర్స్ కళ్లలో బాగానే పడ్డారు. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సింగిల్ సినిమాలో కేతిక శర్మ నటిస్తున్నారు. అయితే ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్‌గా ఫిలింనగర్ టాక్. మరో హీరోయిన్ ఇవానాకు మెయిన్ రోల్ దక్కిందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే సింగిల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంబటి రాంబాబులా శ్యాంబాబు రోల్
అయితే యాదృచ్ఛికంగా కేతిక శర్మపై ఓ ట్యాగ్ పడింది. ఆమె సినిమాలో ఉంటే ఖచ్చితంగా కాంట్రవర్సీ గ్యారంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తొలుత పవన్ కళ్యాణ్ - సాయిథరమ్ తేజ్ నటించిన బ్రో సినిమాలో కేతిక నటించారు. ఇందులో థర్ట్ ఇయర్స్ పృథ్వీ పాత్ర పేరు శ్యాంబాబు. ఓ పాటలో ఆయన వేసి స్టెప్స్, గెటప్ అన్ని నాటి వైసీపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందంటూ వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై అంబటి స్వయంగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. దీంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
శేఖర్ మాస్టర్‌పై మహిళా సంఘాల ఆగ్రహం
రీసెంట్‌గా కేతిక నటించిన మూవీ రాబిన్ హుడ్. ఈ సినిమాలో కేతిక ఐటెం సాంగ్ చేయగా.. ఆమె మిడ్డి పైకి లేపుతూ వేసిన స్టెప్స్ కాంట్రవర్సీ అయ్యాయి. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌పై మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. ఒక దశలో తెలంగాణ మహిళా కమీషన్ మొట్టికాయలు వేయడంతో కేతిక స్టెప్స్‌ను తెరపై కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది చిత్ర యూనిట్. ఇక రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో రాజేంద్రప్రసాద్ దిగొచ్చి వార్నర్‌కు క్షమాపణలు చెప్పారు.
శ్రీవిష్ణుపై మంచు విష్ణు ఫైర్
తాజాగా కేతిక నటిస్తోన్న మూవీ సింగిల్. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. ఇందులో కన్నప్ప, మంచు అనే పదాల్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ఫైర్ అయ్యారు . సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తాను ఫైట్ చేస్తుంటే.. సినిమా వాళ్లే అయ్యుండి తమను ఇలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ విష్ణు ఫైర్ అయ్యారు. దీంతో సింగిల్ టీమ్ స్పందించింది. స్వయంగా హీరో శ్రీవిష్ణు.. మంచు విష్ణుకు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆ డైలాగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పారు. అలా తన ప్రమేయం లేనప్పటికీ.. తను నటించిన ప్రతి సినిమా వరుసపెట్టి వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంతో కేతిక శర్మపై టాలీవుడ్‌లో బ్యాడ్ సెంటిమెంట్ పడింది. ఇది ఆమె కెరీర్‌కు ఎఫెక్ట్ చూపిస్తుందా? లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











