బాలకృష్ణ, చిరంజీవితో ఎందుకు నటించడం లేదంటే.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్
సినీరంగంలో పురుషాధిక్యత ఎక్కువ. ఇక్కడ అన్ని విభాగాల్లోనూ మగవారిదే డామినేషన్. అలాంటి చోట తలెత్తుకుని సవాల్ విసిరిన కొందరు లేడీ సూపర్‌స్టార్లుగా ప్రజల మన్ననలను పొందారు. భానుమతి రామకృష్ణ, జమున, సావిత్రి, విజయ నిర్మల వంటి వారు వీరిలో కొందరు. ఈ కోవలోకే వస్తారు విజయశాంతి. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.
నేటి భారతం, కర్తవ్యం, ప్రతిఘటన, ఓసేయ్ రాములమ్మ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో లేడీ సూపర్‌స్టార్‌గా, లేడీ అమితాబ్‌గా, యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా జేజేలు అందుకున్నారు విజయశాంతి. ఒకానొక దశలో స్టార్ హీరోల సినిమాలకు ఆమె చిత్రాలు గట్టి పోటీనిచ్చాయి. రాములమ్మ పని అయిపోయిందన్న ప్రతీసారి పడిలేచిన కెరటంలా దూసుకొచ్చేవారు. ఆమె చేసిన పాత్రలు తర్వాతి రోజుల్లో కొత్త తరం అమ్మాయిలకు స్పూర్తిగా నిలిచాయి. అంతేకాదు.. విజయశాంతి చేసిన సినిమాలు చూసి స్పూర్తి పొంది, ఆమె లాగే పోరాట పటిమ చూపినవారు ఎందరో. కర్తవ్యం సినిమా చూసి చాలా మంది అమ్మాయిలు పోలీస్ శాఖలో చేరారంటే అతిశయోక్తి కాదు. టాప్ హీరోలతో పోటీ పడి మరీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన ఏకైక హీరోయిన్‌గానూ రాములమ్మ గుర్తింపు తెచ్చుకున్నారు. కర్తవ్యం సినిమాకు ఆమె రూ.కోటి పారితోషికం అందుకున్నారని టాక్.

అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరికీ విజయశాంతి 'విజయనాయిక'గా నిలిచారు. బాలయ్య, చిరు ఇద్దరికీ ఆమె హిట్ పెయర్‌గా నిలిచారు. చిరంజీవి - విజయశాంతి జోడీగా 19 సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మెజారిటీ చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. 80, 90 దశకాలలో ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉండేది. ముఖ్యంగా మెగాస్టార్‌తో సమానంగా విజయశాంతి వేసే బ్రేక్ డ్యాన్సులకు థియేటర్లు మోతెక్కిపోయేవి. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణతోనూ నటించి హిట్ పెయిర్ అనిపించుకున్నారు విజయశాంతి. బాలయ్యతో 17 సినిమాల్లో హీరోయిన్‌గా నటించగా.. వీటిలో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వీటిలో రెండు సినిమాలు తప్పించి మిగిలినవన్నీ ఘన విజయం సాధించాయంటే ఈ జంట ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటిది చిరంజీవి, బాలకృష్ణలతో తర్వాతి రోజుల్లో విజయశాంతి ఎందుకు సినిమాలు చేయలేదనే బాధ ఇప్పటికీ అభిమానుల్లో ఉంది. చిరు, బాలయ్యతో ఆమెకు విభేదాలు ఉన్నాయని అందుకే వారిద్దరితో నటించడం మానేశారని రకరకాల గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. వీటిపై ముగ్గురూ ఏనాడూ స్పందించలేదు.

ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఇదే ప్రశ్న అడగ్గా.. దానికి లేడీ అమితాబ్ ఆసక్తికరంగా సమాధానం చెప్పారు. వారిద్దరితో సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకంగా కారణాలు లేవని, డేట్స్ కుదరక, వేరే సినిమాలు కమిటై ఉండటంతోనే సాధ్యపడలేదన్నారు. తన ఇమేజ్ తారాస్థాయికి చేరడంతో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేయాల్సి వచ్చిందని విజయశాంతి గుర్తుచేసుకున్నారు. అలాగే రెమ్యూనరేషన్ సైతం పెరిగిపోయిందని, తానే ఒక హీరో రేంజ్‌కు చేరడంతో ఆ దారిలోనే వెళ్లిపోయానని ఆమె క్లారిటీ ఇచ్చారు.
అలాంటి సమయంలో ఒక స్థార్ హీరో పక్కన తాను నటిస్తే నిర్మాతకు ఖర్చు పెరిగిపోయేదని లేడీ సూపర్‌స్టార్ తెలిపారు. లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ చిరంజీవితో గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు సినిమాలు చేశానని విజయశాంతి చెప్పారు. యాక్షన్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తానని తాను జీవితంలో ఊహించలేదని ఇదంతా దేవుడి వరమేనన్నారు. కేవలం లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్ వల్లే తాను బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేయలేదని , అది మినహా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని రాములమ్మ కుండబద్ధలు కొట్టేశారు.


Click it and Unblock the Notifications











