మెగా కోడలిపై డైరెక్టర్ వేధింపులు.. తప్పుడు ప్రచారం, కేసులు పెట్టారంటూ..
టాలీవుడ్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి, తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌లో మంచి విజయాలను అందుకుంటున్న సమయంలోనే లావణ్య తన వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మెగా హీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడిన ఆమె, తర్వాత అతనిని వివాహం చేసుకుని మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు.
వీరిద్దరూ కలిసి ముందుగా మిస్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగి తర్వాత ప్రేమగా మారినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి కుటుంబ జీవితం, కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మెగా కుటుంబంలో కోడలిగా ఆమెకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ, అదే సమయంలో సినీ కెరీర్‌పై కూడా దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నారు. అయితే.. ఇటీవల టాలీవుడ్ నటి లావణ్య త్రిపాఠి తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది.

తాజాగా లావణ్య త్రిపాఠి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను పెద్దగా బయటపెట్టని లావణ్య త్రిపాఠి, ఈసారి గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ తన మనసులోని బాధను వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. 2016కి ముందు తనకు ఒక తమిళ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. అయితే ఆ సినిమా దర్శకుడితో పని చేయడంలో తాను అసౌకర్యంగా ఫీలయ్యానని, అతని వేధింపులు భరించలేక ఆ సినిమాను తిరస్కరించానని తెలిపారు. కానీ, ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే తనపై కేసులు పెట్టారనీ, అలాగే పలు రకాలుగా దుష్ప్రచారం మొదలైందని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా.. ఆ సమయంలో కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానెల్స్ పై నెగెటివ్ వార్తలు ప్రచారం చేశాయని లావణ్య త్రిపాఠి అన్నారు. ఆనాడు ఆ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేకపోయాననీ, ఎవరి సాయం తీసుకోలేదని తెలిపారు. కానీ, ఆ పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయని, ఒక దశలో తాను ఒంటరిగా గదిలోకి వెళ్లి గట్టిగా ఏడ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. 'నార్మల్ గా నేను ఏ విషయంలో ఏడువను. కానీ, ఆ రోజు నేను ఒంటరిగా గదిలోకి వెళ్లి చాలా ఏడ్చాను.అలా కాసేపు ఏడ్చిన తర్వాత ఒక కప్పు టీ తాగి చిల్ అయ్యానని, కొంతసేపటి తర్వాత కన్నీళ్లు తుడిచి మళ్లీ నవ్వుతూ బయటకు వచ్చాను' అని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి కష్టసమయాల్లో తాను ఒక విషయం గుర్తుంచుకున్నానని కూడా లావణ్య తెలిపారు. 'జీవితంలో నరకంలాంటి పరిస్థితుల ఎదుర్కొన్న వాటిని చూసి ఆగిపోకండి, ధైర్యంతో ముందుకు సాగండి' అని పేర్కొన్నారు. అప్పుడప్పుడు అలా ఏడవడం కూడా మంచిదే అంటూ లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఏ సినిమా సమయంలో ఇది జరిగింది? ఈమెను ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం లావణ్య బయట పెట్టలేదు. ఇలా డైరెక్టర్ కారణంగా ఇబ్బందులు పడ్డాననే విషయాన్ని తెలియజేయడంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











