‘చిరంజీవిని అలా అనడం చూసి తట్టుకోలేకపోయా.. అందుకే అలా రియాక్ట్ అయ్యా'
Lavanya Tripathi: మెగా కోడలు, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె, మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత మెగా కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన లావణ్య ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి మాతృత్వ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సతీలీలావతి'. ఈ సినిమా మార్చి 6న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్లను లావణ్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌కు గట్టి సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి ఆ ట్వీట్ వెనుక ఉన్న కారణాన్ని వివరంగా వెల్లడించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో కొందరు నెగటివ్ కామెంట్లు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను చూసిన లావణ్య త్రిపాఠి వెంటనే స్పందిస్తూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ విషయంపై తాజాగా ఆమె మాట్లాడుతూ తన స్పందన వెనుక అసలు కారణం ఏమిటో చెప్పారు.

లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. 'చిరంజీవి గారు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. నేను దగ్గరుండి ఆయనను చూస్తున్నాను. ఆయన పిల్లలతో ఎలా ఉంటారో, ఇంట్లో మహిళలను ఎంత గౌరవంగా చూస్తారో నాకు తెలుసు. పిల్లలను ఆయన తల్లి లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆ విషయాన్ని నేను స్వయంగా చూస్తున్నాను. అలాంటి వ్యక్తిపై సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు రావడం చూసి నాకు చాలా బాధ వేసింది'అని తెలిపారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని కామెంట్లు పూర్తిగా అబద్ధమని కూడా ఆమె అన్నారు. 'ఆ కామెంట్లు చేసిన వారికి అసలు నిజం ఏమిటో తెలియదు. వారు విన్నది లేదా ఊహించినదాన్ని నిజం అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అందుకే నేను ఆ సమయంలో స్ట్రాంగ్‌గా స్పందించాల్సి వచ్చింది' అని లావణ్య త్రిపాఠి స్పష్టం చేశారు.
సాధారణంగా తాను సోషల్ మీడియాలో చాలా కూల్‌గా ఉంటానని, గతంలో చేసిన ట్వీట్లు చూసినా అది అర్థమవుతుందని చెప్పారు. 'నేను సాధారణంగా 90 శాతం విషయాల్లో కూల్‌గా ఉంటాను. ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఇలాంటి స్ట్రాంగ్ ట్వీట్ చేయలేదు. కానీ చిరంజీవి గారి గురించి వచ్చిన కామెంట్లు పూర్తిగా తప్పు కావడంతో ఈసారి స్పందించాల్సి వచ్చింది'అని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో కొందరు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.
'కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది నిజమైన సమాచారం కాదనే విషయాన్ని కూడా మరిచిపోతున్నారు. యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మా గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారు. అలా తప్పు సమాచారం ప్రచారం చేయడం చాలా తప్పు’ అని లావణ్య అన్నారు.
ఇంటర్వ్యూలో ఆమెను మెగా ఫ్యామిలీ ఈ విషయంపై ఎలా స్పందించింది అని అడగగా, లావణ్య ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'మా ఇంట్లో ఇలాంటి విషయాల గురించి అసలు మాట్లాడం. సోషల్ మీడియాలో వచ్చే విషయాలను పెద్దగా పట్టించుకోము. అందుకే ఈ విషయంపై ఇంట్లో ఎలాంటి చర్చ కూడా జరగలేదు' అని తెలిపారు. అదే సమయంలో తమ కుటుంబంలో మహిళలు, పురుషులు అనే తేడా ఉండదని కూడా లావణ్య చెప్పారు.
'మా ఇంట్లో ఆడవారు, మగవారు అనే తేడా ఎప్పుడూ లేదు. అందరినీ సమానంగా గౌరవిస్తారు. ఆ విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే నేను అలా రియాక్ట్ అయ్యాను'అని మరోసారి స్పష్టం చేశారు. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవిపై వచ్చిన ట్రోలింగ్‌కు తాను ఇచ్చిన స్పందన వెనుక ఉన్న అసలు కారణాన్ని లావణ్య త్రిపాఠి వివరించడంతో ఈ విషయం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











