ఆ హీరోయిన్‌ను అందుకే కొట్టా.. దాసరి ముందే ఆ పని.. జయసుధ వివాదాస్పదంగా!
జయసుధ.. ఇప్పటి తరానికి అమ్మ, అమ్మమ్మ, బామ్మ క్యారెక్టర్లతోనే సుపరిచితం. కానీ ఒకప్పుడు ఈమెది సూపర్‌స్టార్ ఇమేజ్. అందం, అభినయం , అదృష్టం ఒకే పక్షాన ఉన్న అరుదైన నటీమణుల్లో జయసుధ ఒకరు. ఆ రోజుల్లో అగ్ర కథానాయకులతో సమానంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జయసుధ. ఏ పాత్ర ఒప్పుకుంటే ఆ రోల్‌లోకి పరకాయ ప్రవేశం చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. జయసుధ నటనా కౌశలానికి ఫిదా అయిన అభిమానులను ఆమెను సహజనటిగా ముద్దుగా పిలుచుకునేవారు. ఈనాటికీ జయసుధకు అది ఇంటి పేరుగా మారిపోయింది.
దిగ్గజ నటి, దర్శకురాలు విజయ నిర్మలకు జయసుధ సమీప బంధువు. వీరే కాదు .. ఇండస్ట్రీలో ఎంతోమంది సన్నిహితులు జయసుధ కుటుంబానికి ఉండేవారు. 14 ఏళ్ల వయసులోనే పండంటి కాపురం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అనంతరం చిన్నా చితకా పాత్రలతోనే తన కెరీర్ మొదలుపెట్టిన జయసుధకు లక్ష్మణరేఖ, జ్యోతి మూవీలు మంచి గుర్తింపు తెచ్చాయి.

అద్భుతమైన నటనతో పాటు అందచందాలతోనూ అలరించిన జయసుధ .. అప్పటి సూపర్‌స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, విష్ణువర్థన్, సుమన్, చంద్రమోహన్, మురళీ మోహన్, మోహన్ బాబులతో నటించారు. ముఖ్యంగా శోభన్ బాబు చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్‌లలో ఒకరిగా జయసుధ ఖచ్చితంగా ఉండేవారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు.
70, 80వ దశకాల్లో శ్రీదేవి, జయప్రద, జయసుధల మధ్య పోటీ తారా స్థాయిలో ఉండేది. ఆ రోజుల్లో ఏ స్టార్ హీరో అయినా సరే.. వారికి హీరోయిన్‌గా ఈ ముగ్గురిలో ఒకరు , లేదంటే ఇద్దరు ఉండాల్సిందే. అయితే జయప్రద, శ్రీదేవిలకు బాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో వారిద్దరూ హిందీ పైనే కాన్సన్‌ట్రేషన్ చేశారు. దీంతో శ్రీదేవి, జయప్రద చేయాల్సిన గ్లామర్,సెంటిమెంట్, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ జయసుధ ఇంటికి క్యూ కట్టడంతో ఊపిరి సలపనంత బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయారామె.

అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లను డీల్ చేయాలంటే దర్శక నిర్మాతలకు కత్తిమీద సాములా ఉండేదట. గౌరవ , మర్యాదలు, సినిమాలో ప్రాధాన్యం విషయంలో గొడవలు జరిగేవట. అలాంటిది వివాదాలకు దూరంగా ఉండే జయసుధకు మరో హీరోయిన్ జయచిత్రకు మధ్య మనస్పర్థలు ఉండేవని అప్పట్లో మీడియా కోడైకూసింది. ఈ నేపథ్యంలో జయచిత్ర వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు జయసుధ.
ఓ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. రెబల్‌స్టార్ కృష్ణంరాజు హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన కటకటాల రుద్రయ్య సినిమాలో జయసుధ, జయచిత్ర హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న వడ్డే రమేశ్ .. జయసుధకు మంచి కాస్ట్యూమ్స్, స్లిప్పర్స్ తదితర వస్తువులు తీసుకొచ్చి ఇచ్చారట.

ఈ విషయం జయచిత్ర చెవినపడటంతో పాటు ఆమెకు ఇచ్చిన వస్తువులు నాసిరకంగా ఉండటంతో కోపం నషాళానికి ఎక్కిందట. జయసుధ తనకంటే ఎక్కడ అందంగా కనిపిస్తుందోనని దాసరికి కంప్లయంట్ చేశారట. అయితే కృష్ణంరాజు మంచి హైట్ కావడంతో ఆయన పక్కన సెట్ కావడానికే తాను నాలుగైదు ఇంచుల హై హీల్స్ వేసుకున్నానని జయసుధ కూడా వివరణ ఇచ్చారట.
అన్నింటికి మించి జయచిత్రలో డామినేషన్ లక్షణాలు ఎక్కువగా ఉండేవని అది చేయి, ఇది చేయి అంటూ ఆర్డర్స్ వేసినట్లుగా బిహేవ్ చేసేదని జయసుధ గుర్తుచేసుకున్నారు. కటకటాల రుద్రయ్య క్లైమాక్స్ సీన్‌లో ఇద్దరు కొట్టుకునే సీన్ ఉండటంతో దాసరి .. ఇద్దరినీ బాగా కొట్టుకోమన్నారని చెప్పారట. అప్పటికే హై హీల్స్ విషయంలో గొడవ జరగడంతో జయచిత్ర, జయసుధ నిజంగానే కొట్టుకున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగిందట. కానీ చెప్పుల విషయంలో చిన్న గొడవ జరిగిందని, బీచ్‌లో కొట్లాట కేవలం సినిమా కోసమే చేశామని జయసుధ క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











