‘బాహుబలిలో ఆఫర్ ఇస్తానని చెప్పి.. రాజమౌళి ఎందుకు రిజెక్ట్ చేశారంటే?’
తెలుగు సినిమా పరిశ్రమలో ముందుతరం హీరోయిన్లలో కాంచన ప్రతిభాపాటవాలను కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ లాంటి అగ్ర నటుల చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ తరం వారికి ఆదర్శంగా నిలిచే నటీమణుల్లో ఒకరిగా అనిపించుకొన్నారు. అయితే ఎనిమిది పదుల వయసులోను ఆమె ఇంకా నటించాలనే కోరికతో ఉండటం అత్యంత ఆసక్తిని కలిగించే విషయం. ఇటీవల ఆమె తెలుగు మీడియాతో మాట్లాడుతూ.. బాహుబలి సినిమాలో ఆఫర్ ఎలా మిస్ అయ్యానని చెప్పారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ. బాహుబలి సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ రెమ్యునరేషన్ ఇచ్చే విషయంలో మా మధ్య కుదర్లేదు. నాకు పారితోషికం ఇవ్వడానికి మీరు ముందు వెనుకా ఆలోచించారు. మీకు అంత డబ్బు ఉంది. నాకు ఇవ్వడానికి కష్టమైందా? నాకు డబ్బు ఇవ్వడానికి చాలా ఆలోచించారు. మాకు కొంత డబ్బు ఇస్తే చాలా సేవలకు ఉపయోగిస్తాం అని కాంచన అన్నారు.

బాహుబలి ఆఫర్‌ను నేను అడ్వాంటేజ్‌గా తీసుకొంటాననిపిస్తే అందుకు సారీ. వాస్తవం చెప్పాలన్నదే నా ఉద్దేశం. నాకు 84 సంవత్సరాలు. చక్కగా గొంతు, మనసు, శరీరం, ఆరోగ్యం చక్కగా ఉండేలా దేవుడు ఆశీస్సులు అందించారు. రెండు రోజుల షూటింగ్ కోసం నాకు కనీసం 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాను. కానీ వాళ్లు ఇవ్వలేము. కుదరదని చెప్పారని కాంచన వెల్లడించారు.
బాహుబలి సినిమాలో హీరో ఓల్డ్ ఏజ్ వెర్షన్‌కు సపోర్టుగా ఉండే వేషం ఇస్తానని చెప్పారు. కానీ ఈ కారణంగా ఆ సినిమాలో నటించే అవకాశం దక్కలేదు. నేను ఇలా మాట్లాడుతున్నందుకు తప్పుగా అనుకొన్న పర్వాలేదు. ఒక ఆర్టిస్టుగా నేను పడిన బాధను మీతో పంచుకోవాలని అనుకొన్నాను. నేను చెప్పిన విషయాలను పాజిటివ్‌గా తీసుకోండి. ఆ తరం వారిలో నేను, షావుకారు జానకి లాంటి వాళ్లు ఇంకా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా నటించాలనే కోరిక కూడా ఉంది అని కాంచన తెలిపారు.
భారీ బడ్జెట్‌తో రూపొందిన బాహుబలి సినిమాలో నటించిన వారందరికీ మంచి పేరు రావడమే కాకుండా నిర్మాతలకు కోట్ల రూపాయలు వర్షం కురిసింది. సినిమా చరిత్రలో బాహుబలి చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా ఎందరికో ఊహించని విధంగా కెరీర్‌కు మార్గం వేసింది. ఈ చిత్రంలో కాంచన లాంటి గొప్ప నటిని చూడలేకపోవడం నిజంగా అసంతృప్తిని కలిగించే విషయమే.
ఇదిలా ఉండగా, గతంలో ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించిన కాంచన గారు.. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాలో గుర్తుండిపోయే పాత్రను పోషించారు. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ బామ్మ పాత్రలో ఆమె మెప్పించారు. సినిమా ఆరంభంలోనే ఆమె నేరేటివ్ క్యారెక్టర్‌లో గొప్పగా హావభావాలు ప్రదర్శించారు. ఇలాంటి గొప్ప నటికి ఏవరైనా ముందుకు వచ్చి అవకాశాలు ఇస్తే.. మరిచిపోలేని పాత్రలు చేసే అవకాశం కలుగుతుందేమో.


Click it and Unblock the Notifications











