‘ఆ రోజులు అయిపోయాయి.. ఐదేళ్ల క్రితం అప్పులే ఇంకా కట్టుకుంటున్నా'
మంచు మోహన్ బాబు వారసురాలు, నటి, నిర్మాత మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటిగా, నిర్మాతగా బిజీబిజీగా ఉంది. ఈ అమ్మడు ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతుంది. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొని, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మంచు లక్ష్మీ ఏమన్నారంటే?
కోలీవుడ్ హీరో విజయ్ అంథోని అక్క కొడుకు అజయ్ దీషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బుకీ (Bookie) త్వరలో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ధనుష నటించగా, పాండియరాజన్, సునీల్, ఇందుమతి, మణికంఠన్, వివేక్ ప్రసన్న, బ్లాక్ పాండి, ఆదిత్య కతిర్, ప్రియాంక తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను మలిచినట్టు మూవీ మేకర్స్ చెబుతోంది.

గణేశ్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించడమే కాకుండా కీలక పాత్రలో కూడా నటించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా ఈ నెల 20న తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ హజరయ్యారు.
ఈ సమయంలో మీడియా ప్రతినిధులు సినిమాల వల్ల నష్టాలు ఎదుర్కొన్నారా అని ప్రశ్నించగా, మంచు లక్ష్మీ భావోద్వేగంగా స్పందించారు. 'ఆ రోజులు అయిపోయాయి. అప్పులు అనేవి వందశాతం నిజం. ఐదేళ్ల క్రితం తీసిన సినిమాకు సంబంధించిన అప్పులు ఇప్పటికీ కట్టుకుంటున్నాను' అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. ఒకప్పుడు నిర్మాతగా సినిమాలు చేసిన తాను... ఇప్పుడు పూర్తిగా యాక్టర్‌గానే కొనసాగుతున్నానంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
మీరు ప్రొడ్యూసర్ కదా... మీకు ఆఫర్లు వస్తుంటాయా? అని అడిగితే.. 'ఆ రోజులు అయిపోయాయి. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్‌ని కాదు... ఓన్లీ యాక్టర్‌ని' అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'కథ చెప్పడానికి ఎవరైనా వస్తే... ముందుగా ప్రొడ్యూసర్ ఎవరని అడుగుతున్నా. తర్వాతే కథ ఏంటో వింటున్నా. ప్రొడ్యూసర్ ఉంటేనే కదా కథ వినేది' అంటూ నవ్వులు పూయించారు.
ఒకప్పుడు చెక్కులు ఇచ్చిన మీరు... ఇప్పుడు చెక్కులు రావాలని ఆశిస్తున్నారా? అని ప్రశ్నించగా, 'అందుకే తెలుగులో కాకుండా తమిళ్‌లో సినిమాలు చేస్తున్నా. అక్కడైనా చెక్కులు వస్తున్నాయి లే' అంటూ మరో ఫన్నీ కామెంట్ చేశారు. కానీ ఈ నవ్వుల మధ్యే ఆమె చేసిన ఓ వ్యాఖ్య అభిమానులను షాక్‌కు గురి చేసింది. నిజంగా డబ్బులు పోగొట్టుకున్నారా? అనే ప్రశ్నకు మంచు లక్ష్మి చాలా స్పష్టంగా స్పందించారు. 'సినిమా తీసి డబ్బులు పోగొట్టుకున్న విషయం 100% వాస్తవం. ఐదేళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇప్పటికీ కడుతూనే ఉన్నా. అందుకే వరుసగా వేరే సినిమాలు చేస్తున్నా. ఇలా అయినా ఆ లోన్లు కట్టవచ్చని భావిస్తున్నా' అని ఎమోషనల్‌గా చెప్పారు.


Click it and Unblock the Notifications











