టాలీవుడ్ హీరోతో డేటింగ్ రూమర్లు... హీరోయిన్ మీనాక్షి చౌదరీ క్లారిటీ!
Meenakshi Chaudhary: టాలీవుడ్ బ్యూటీ , హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది ఈ క్యూట్ బ్యూటీ. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన మీనాక్షి, తన అందం, టాలెంట్‌తో సినిమా అవకాశాలు అందిపుచ్చుకుని ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ బిజీగా మారింది. అయితే ఇటీవల ఆమె వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా డేటింగ్, పెళ్లి గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున సాగుంది. ఈ రూమర్స్ ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే ?
హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి, ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమె తండ్రి భారత సైన్యంలో కీలక హోదాలో విధులు నిర్వర్తించారు. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా చదువులోనూ, క్రమశిక్షణలోనూ ముందుండే మీనాక్షి, పంజాబ్‌లోని నేషనల్ డెంటల్ కాలేజీ హాస్పిటల్‌లో డెంటల్ సర్జరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డాక్టర్‌గా చదువుకున్నప్పటికీ, మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలో అడుగుపెట్టారు. అంతేకాదు, స్టేట్ లెవల్ స్విమ్మర్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా కూడా అనేక అవార్డులు గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ విజేతగా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించారు.

2019లో హిందీ సినిమా 'అప్‌స్టార్ట్స్'తో వెండితెరకు పరిచయమైన మీనాక్షి, 2021లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఖిలాడీ, హిట్ 2, గుంటూరు కారం, మట్కా, మెకానిక్ రాకీ వంటి సినిమాల్లో నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఆ వెంటనే 'సంక్రాంతికి వస్తున్నాం'మూవీతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళంలో ది గోట్, సింగపూర్ సెలూన్, కోలై వంటి సినిమాల్లోనూ నటించారు.
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి సరసన నటించిన 'అనగనగా ఒక రాజు'సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో కలిసి 'వృషకర్మ' అనే మైథలాజికల్ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్కియాలజిస్ట్ 'దక్ష' పాత్రలో మీనాక్షి కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్‌కే మంచి స్పందన వచ్చింది.
ఇంత బిజీ కెరీర్ మధ్యలోనే మీనాక్షి చౌదరి వ్యక్తిగత జీవితంపై మరోసారి పుకార్లు మొదలయ్యాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడు సుశాంత్ తో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2021లో ఇద్దరూ కలిసి నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో, ఈ రూమర్లుకు మరింత ఊతం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇంతకుముందే వీరి పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై అప్పుడే మీనాక్షి స్పందిస్తూ..అవన్నీ ఫేక్ న్యూస్ అని, వాటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ, రూమర్లు మాత్రం ఆగలేదు. తాజాగా కొన్ని మీమ్ పేజీలు వచ్చే ఏడాది వీరి పెళ్లి అంటూ మళ్లీ ప్రచారం చేయడంతో, హీరోయిన్ టీమ్ మరోసారి స్పందించింది. మీనాక్షి చౌదరి టీమ్ విడుదల చేసిన ప్రకటనలో 'మీనాక్షి, సుశాంత్ ఇద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే. పెళ్లి, డేటింగ్ వంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీనాక్షికి సంబంధించిన ఏ విషయమైనా అధికారికంగా మేమే తెలియజేస్తాం'అని స్పష్టం చేసింది.
మొత్తంగా కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉన్న మీనాక్షి చౌదరి, వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు మరోసారి గట్టి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టిందని, డేటింగ్, పెళ్లి వార్తలు కేవలం ఊహాగానాలేనని స్పష్టమైంది.


Click it and Unblock the Notifications











