ఏపీ కొత్త కేబినెట్ లో అదిరిపోయే ట్విస్ట్.. రాదనుకుని ఇంట్లో ఉండిపోయిన నటి రోజాకి మంత్రి పదవి!
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ నటి రోజాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. చాలా సంవత్సరాలుగా రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఎమ్మెల్యే రోజాకు ఇప్పుడు మంత్రి పదవి దక్కింది. దీంతో ఆమె త్వరలో ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

మంచి క్రేజ్
తిరుపతిలో నాగరాజ రెడ్డి, లలిత దంపతులకు జన్మించిన శ్రీలత రెడ్డి ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేసింది. అలా సినిమాల్లోకి వచ్చాక ఆమె రోజాగా పేరు మార్చుకుంది. ఆమె మొట్ట మొదటి సినిమా పేరు ప్రేమ తపస్సు కాగా ఆ సినిమాలో ఆమె రాజేంద్రప్రసాద్ సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమెను ఆర్కే సెల్వమణి ప్రశాంత్ హీరోగా తమిళంలో పరిచయం చేశారు. రెండు సినిమాలు హిట్ కావడంతో ఒక పక్క తెలుగులో మరో పక్క తమిళ్ లో ఆమెకు మంచి క్రేజ్ లభించింది.

సెల్వమణిని ప్రేమ వివాహం
తెలుగులో ఆమె దాదాపు స్టార్ హీరోలందరితో నటించింది. ముఖ్యంగా ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, అన్నమయ్య, అన్న, పెద్దన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శుభలగ్నం, శ్రీకృష్ణార్జున విజయం వంటి సినిమాలతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఆమె తర్వాత కాలంలో అవకాశాలు తగ్గడంతో తనకు తమిళ్ లో మొదటి సినిమా చేసిన దర్శకుడు సెల్వమణిని ప్రేమ వివాహం చేసుకుంది.

నగరి ఎమ్మెల్యేగా
1999 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా నియమించబడింది. సుమారు పది సంవత్సరాల పాటు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా సేవలందించిన ఆమె 2009వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. డిపోయిన కొన్ని రోజులకే ఆమె వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు కానీ ఆమె చేరే లోపు ఆయన మరణించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆమె నగరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అవకాశం లేదని
ఆ తర్వాత 2019లో కూడా అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి ఆశించారు కానీ అనేక సమీకరణల నేపథ్యంలో ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఆమెను 2020వ సంవత్సరంలో ఏపీఐఐసీ చైర్మన్ గా నియమించారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న నేపథ్యంలో రోజాకి కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని తొలుత ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఆమెకు దక్కే అవకాశం లేదని కూడా మళ్ళీ ప్రచారం జరిగింది.

ప్రమాణ స్వీకారం
ఈ నేపథ్యంలోనే ఆమె ప్రమాణ స్వీకారం కోసం అమరావతి వెళ్లకుండా హైదరాబాద్ నివాసంలోనే ఉండిపోయారు. కానీ అనుకోని పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకి అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆమె ఏ శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు అనేది ప్రమాణస్వీకారం తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 11:31 కు జరగనుంది.


Click it and Unblock the Notifications











