చిరంజీవి కోసం నయనతార రూల్స్ బ్రేక్ .. అనిల్ రావిపూడికి మైండ్ బ్లాక్!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రమోషన్స్ అంటే ఓ ప్రత్యేక శైలిని సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన సినిమా అంటే కథ, కంటెంట్‌తో పాటు ప్రచారంలోనూ ఏదో ఒక కొత్తదనం తప్పనిసరిగా కనిపిస్తుంది. అలాంటి అనిల్ రావిపూడికే ఈసారి లేడీ సూపర్ స్టార్ నయనతార ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం తన రూల్‌ను బ్రేక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
సాధారణంగా ఒక సినిమా జనాల్లోకి వెళ్లాలంటే పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు... ఇలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాల్సిందే. కానీ నయనతార మాత్రం తన కెరీర్‌లో ఎప్పటినుంచో ఒక స్పష్టమైన నిబంధన పాటిస్తోంది. తాను నటించిన సినిమా ఎంత పెద్దదైనా, స్టార్ హీరో సినిమా అయినా సరే... ప్రమోషన్లకు వెళ్లబోనని ముందే చెబుతుంది. షారుఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమా విషయంలో కూడా నయనతార ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇదే ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్‌గా మారింది.

అయితే ఈసారి ఆ నిబంధనకు బ్రేక్ పడింది. మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా కోసం నయనతార స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. చిరంజీవి అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది.
సినిమా విడుదలకు దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగం పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఓ కాన్సెప్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నయనతార స్వయంగా ప్రమోషన్స్ గురించి ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.' సినిమా స్టార్ట్‌లో ఒక ప్రమోషనల్ వీడియో చేశాం కదా... ఇప్పుడు ఏం చేయాలి?' అని నయనతార అనిల్ రావిపూడిని అడగడంతో ఆయన ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం నవ్వులు పూయించింది. దానికి అనిల్ రావిపూడి 'మీరు ప్రమోషన్స్ గురించి అడగడమే పెద్ద ప్రమోషన్ మేడమ్' అంటూ ట్రేడ్‌మార్క్ హ్యూమర్‌తో సమాధానం ఇవ్వడం వీడియోకి హైలైట్‌గా మారింది.
అంతటితో ఆగకుండా నయనతార 'అయితే జనవరి 12న సినిమా వస్తోంది అని చెప్పాలా?' అని అడగడం, అనిల్ రావిపూడి 'అంతే చాలు' అని చెప్పడం, చివర్లో చిరంజీవి స్టైల్‌లో 'హలో మాస్టర్ ఫేస్, కెమెరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి' అంటూ నయనతార చెప్పిన డైలాగ్ నెటిజన్లను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఈ చిన్న వీడియోనే ఇప్పుడు భారీ ప్రమోషన్‌గా మారిపోయింది.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో స్పందన అదిరిపోయింది. 'ఇలాంటి ప్రమోషనల్ ఐడియాలు అనిల్‌కే సాధ్యం', 'సింపుల్‌గా ఉన్నా బాగా కనెక్ట్ అయ్యే ప్రమోషన్', 'నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇది కేవలం వీడియో మాత్రమే కాదు... నయనతార తన ప్రమోషన్స్ రూల్‌ను పక్కన పెట్టి మరీ ఈ సినిమాలో భాగమవడం, మెగాస్టార్ చిరంజీవిపై ఆమెకు ఉన్న గౌరవానికి నిదర్శనంగా చాలా మంది భావిస్తున్నారు.
ఇప్పటికే సినిమా ప్రారంభ సమయంలో నయనతార హీరోయిన్‌గా ఎంపికైన విషయాన్ని కూడా ఓ స్పెషల్ కాన్సెప్ట్ వీడియోతోనే అనౌన్స్ చేశారు. అప్పుడే అనిల్ రావిపూడి నయనతారను ప్రమోషన్స్‌కు ఎలా ఒప్పించాడన్న చర్చ మొదలైంది. ఇప్పుడు అయితే ఆమె స్వయంగా వచ్చి 'ప్రమోషన్స్ లేవా?' అని అడగడం అనిల్ రావిపూడికే కాదు, అభిమానులకు కూడా పెద్ద షాక్‌గా మారింది.
సంక్రాంతి రేసులో నిలిచిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కేథరిన్, మురళీధర్ గౌడ్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల కూడా సమయం లేకపోవడంతో, ఇకపై ప్రమోషన్స్ ఎలా ఉంటాయన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఇలా చిరంజీవి సినిమా కోసం తన నిబంధనను పక్కన పెట్టిన నయనతార, అనిల్ రావిపూడి క్రేజీ ప్రమోషన్ ఐడియాలతో కలసి ఈ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. సంక్రాంతికి థియేటర్లలో 'మన శంకర వరప్రసాద్ గారు' ఎంత రఫ్ఫాడిస్తుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











