‘ఆ పనికి వర్జిన్ అమ్మాయిలే కావాలి... చదువుకున్న మగాళ్లకీ అదే యావ’
భారతదేశంలో ఇప్పటికీ కన్యత్వం- కన్యత్వ పరీక్షల గురించి నిత్యం ఏదో ఒక మూల వార్తలు వస్తూనే ఉన్నాయి. దేశం ఎన్నో రంగాల్లో అభివృద్థి చెందుతున్నా.. కన్యత్వ పరీక్షల పేరిట ఆడపిల్లలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. సమాజంలో పెరుగుతున్న ఈ జాడ్యంపై సామాజికవేత్తలతో పాటు సెలబ్రిటీలు కూడా పలుమార్లు దీనిపై స్పందించారు. తాజాగా మగాళ్ల మనస్తత్వం, కన్యత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారో సీనియర్ నటి. ఈ వివరాల్లోకి వెళితే..
44 ఏళ్ల కెరీర్
తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి నీనా గుప్తా. 70కి చేరువ అవుతున్నా ఇప్పటికీ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తుంటారు నీనా. బెంగాల్‌కు చెందిన నీనా గుప్తా ఢిల్లీలో పెరిగారు. 1982లో సాథ్ సాథ్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన నీనా గుప్తా దాదాపు 44 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నారు. హిందీతో పాటు ఒడియా, మలయాళం భాషలలో నటించారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా పలు సీరియల్స్, సిరీస్‌లలో నటించి దర్శకురాలిగానూ బాధ్యతలు చేపట్టారు.

ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులతో వివాదాలు
సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నీనా గుప్తా.. వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాలమయం. తొలుత అమ్లాన్ కుసుమ్ ఘోష్‌తో నీనా గుప్తా పెళ్లి జరిగింది. కొద్దిరోజులకే వీరిద్దరూ విడిపోయారు. అనంతరం సారంగ్‌దేవ్ పండిట్‌తో ప్రేమాయణం నడిపారు. ఇక 80వ దశకంలో క్రికెట్‌లో విధ్వంసక ఆటగాడిగా బౌలర్లకు సింహస్వప్నంలా నిలిచిన వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్‌తో నీనా ప్రేమాయణం క్రికెట్, సినీ రంగాలను కుదిపేసింది. ఆయన కారణంగా గర్బం దాల్చిన నీనా గుప్తా.. మసాబా గుప్తాకు జన్మనిచ్చారు. అయితే రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకోకుండా ఒంటరి తల్లిగానే జీవితాన్ని సాధించారు. 2008లో 40 ఏళ్ల వయసులో ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను పెళ్లి చేసుకుని కలకలం రేపింది నీనా గుప్తా.
వర్జిన్ భార్యలే కావాలి
ఏ విషయంపై అయినా అస్సలు మొహమాట పడకుండా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం నీనా గుప్తా శైలి. మహిళా హక్కులు, స్త్రీ సమానత్వం వంటి అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో పితృస్వామ్యం, పురుషాధిక్యత వంటి అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి సంబంధించి భారతీయ సమాజంలో ఇంకా కన్యత్వం అనేది కీలకమైన అంశంగానే ఉంది. సామాజికంగా పురోగతి సాధించినట్లు పైకి చెబుతున్నా చాలా మంది పురుషులు తమకు కాబోయే భార్య కన్యగానే ఉండాలని కోరుకుంటున్నారు. సిటీలు, పట్నాల్లో బాగా చదువుకున్న మగాళ్లు.. మాకు అభ్యదయ, విశాల భావాలు ఉన్నట్లు నటిస్తారు. కానీ వారికి కూడా భార్య కన్యగానే ఉండాలని నీనా గుప్తా వ్యాఖ్యానించారు.
అత్తల అనుమతి ఉండాల్సిందే
మనదేశంలో ఇప్పటికీ పెళ్లయిన మహిళలు.. ఒళ్లంతా చీరను కప్పుకుని, తలను కొంగుతో కవర్ చేస్తూ మామగారి పాదాలను తాకుతారు. పెళ్లి తర్వాత మహిళలు జీవితాలు దారుణంగానే ఉంటున్నాయి. అన్నింటికి అత్తగారి అనుమతి కావాల్సిందే. కనీసం నచ్చిన దేవుడిని పూజించడానికి, నచ్చిన దేవుడి ఫోటోను పూజగదిలో పెట్టుకోవడానికి కూడా కోడళ్లను అత్తలు అనుమతించడం లేదు. నా మేనకోడలు కూడా ఇలాంటి బాధితురాలే. వారి బెడ్‌రూమ్‌లో ఫ్యామిలీ ఫోటో ఉండొద్దని ఆమె అత్తగారు హుకుం జారీ చేశారు. మనదేశంలో మహిళలు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆడవారి జీవితాలను, స్థితిగతులను మార్చే విషయంలో మనం ఎంతో వెనుక ఉన్నామని నీనా గుప్తా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications










