ఆ బరువును మోస్తూనే ఉన్నా... నిహారిక కొణిదెల ఎమోషనల్ పోస్ట్
కమిటీ కుర్రోళ్లతో నిర్మాతగా హిట్ అందుకోవడంతో పాటు గద్దర్ అవార్డ్ అందుకుని మంచి జోష్ మీదున్నారు మెగా డాటర్ నిహారిక కొణిదెల. తన తదుపరి సినిమా కోసం పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా రాకాస అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు నిహారిక. ఈసారి కూడా హిట్ సాధించి నిర్మాతగా సక్సెస్ కొట్టాలని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నిహారిక తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లో వెళితే...
యాంకర్ నుంచి నిర్మాతగా
మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌గా నిహారిక చరిత్ర సృష్టించారు. అయితే అంతకంటే ముందే బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశించిన ఈ ముద్దుగుమ్మ.. 2015లో ఢీ జూనియర్స్‌కు హోస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం నాగ శౌర్య హీరోగా నటించిన ఒక మనసు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయినప్పటికీ ఎక్కడా తగ్గకుండా హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి, డార్లింగ్ తదితర చిత్రాలలో నటించారు. నటిగా, హోస్ట్‌గా వ్యవహరిస్తూనే నిర్మాతగానూ మారారు నిహారిక కొణిదెల. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి.. ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచీ, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించారు.

చైతన్యతో పెళ్లి, విడాకులు
ప్రముఖ వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డను 2020లో నిహారిక వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు ఈ జంట కాపురం సజావుగానే సాగింది. అయితే వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో 2023 జూలైలో చైతన్య - నిహారికలు విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఇబ్బందులతో కొన్నాళ్లు ఇంటికే పరిమితం అయినప్పటికీ ఆ తర్వాత తిరిగి యాక్టీవ్ అయ్యారు. తనకు ఎంతో ఇష్టమైన నిర్మాణ రంగంలోనే అదృష్టం పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. నిర్మాతగా మెలకువలు నేర్చుకుని బడా సినిమాలు తీస్తానని చెబుతున్నారు నిహారిక.
నిహారిక రెండో పెళ్లిపై గాసిప్స్
కెరీర్ పరంగా నిలదొక్కుకున్న నిహారిక వ్యక్తిగత జీవితంలోనూ సెటిల్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందని పలుమార్లు రూమర్స్ వైరల్ అయ్యాయి.. తర్వాత అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోయాయి. అయితే ఆమె తండ్రి నాగబాబు మాత్రం నిహారిక వ్యక్తిగత జీవితాన్ని, ఆమె నిర్ణయాలను గౌరవిస్తానని తెలిపారు. ఇదే సమయంలో నిహారిక ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటారని నాగబాబు ఆకాంక్షించారు.
గుండెల్లో బరువుని మోస్తున్నా
సినిమాలు, షూటింగ్స్, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు నిహారిక. అలాగే తన స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఆరోగ్యానికి తొలి నుంచి ప్రాధాన్యం ఇస్తుంటారు నిహారిక. జిమ్‌లో వర్కవుట్ ఫోటోలు, వీడియోలతో పాటు తన తండ్రి నాగబాబుతో కలిసి పార్క్‌లో వాకింగ్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. తాజాగా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. నా లోపల తెలియని బరువు మోస్తున్నా.. అది ఒత్తిడి లేక మరొకటి కాదు. అది చెప్పడానికి పదాలు కూడా లేవు. కానీ దీనికి బదులుగా నేను ముందుకు సాగుతున్నా. కొన్ని రోజులు జిమ్‌కి వెళ్లి గుండెల్లో బరువుని ఎత్తుతున్నా. కొన్నిసార్లు వాకింగ్ చేస్తా.. యోగా ప్రాక్టీస్ చేస్తా. బయటి నుంచి ఎలాంటి మార్పులు లేవు. కానీ లోపల మాత్రం మార్పులు కనిపించాయి అని నిహారిక కొణిదెల పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











