Niharika Konidela: ఫిలింఫేర్ అవార్డులపై నిహారిక షాకింగ్ కామెంట్స్.. ఏం జరిగిందంటే?
ప్రతిష్టాత్మక 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక కేరళలోని కొచ్చి వేదికగా ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి అగ్రశ్రేణి నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేడుకలో 2024లో విడుదలైన సినిమాలకు అందిన అవార్డులను అందించారు.
అయితే ఈ వేడుకలో ఒక ముఖ్య అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది.అదే డెబ్యూ అవార్డు గెలుచుకున్న యంగ్ యాక్టర్ ను స్టేజ్‌పై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం. ఈ అంశంపై నటి, నిర్మాత నిహారిక కొణిదెల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?

ఆ వేదిక కేవలం స్టేజ్ కాదు... వాళ్ల కల సాకారం అయ్యే క్షణం
వేడుక పూర్తయ్యాక నిహారిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'ఒకే చోట ఇంతటి ప్రతిభను చూడటం నిజంగా గర్వంగా అనిపించింది. భారతీయ సినిమా ఎంత గొప్పదో మరోసారి అర్థమైంది. కానీ, అదే సమయంలో ఒక అవకాశం చేజారిపోయిందన్న భావన కలిగింది' అని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి డెబ్యూ అవార్డులు గెలుచుకున్న కొత్త నటీనటులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె స్పష్టం చేశారు.
'డెబ్యూ అవార్డు అనేది ఒక ఆర్టిస్ట్ జీవితంలో మరిచిపోలేని క్షణం. ఆ వేదికపై నిలబడి రెండు మాటలు మాట్లాడే అవకాశం దొరికితే, అది వాళ్ల కల నిజమైనట్టే. వాళ్ల మాటలు వింటే మనందరికీ సినిమాలపై ప్రేమ ఎందుకు మొదలైందో మరోసారి గుర్తొచ్చేది' అంటూ నిహారిక భావోద్వేగంగా రాసుకొచ్చారు. పెద్ద అవార్డు షోలలో సమయ పరిమితులు సహజమేనని అంగీకరిస్తూనే, మొదటిసారి అవార్డు అందుకున్న వారికి కనీసం ఒక నిమిషం అయినా ఇవ్వాల్సిందేనని నిహారిక గట్టిగా చెప్పారు. 'ఆ ఒక్క నిమిషం వాళ్ల జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది. వాళ్ల ప్రయాణానికి అదే పెద్ద ప్రోత్సాహం' అని ఆమె వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో మద్దతు వెల్లువ
నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ఆమె మాటలకు మద్దతు తెలుపుతూ.. 'డెబ్యూ అవార్డు అంటే జీవితంలో మైలురాయి', 'కొత్త టాలెంట్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సినీ అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా నిహారిక అభిప్రాయాన్ని సమర్థించడం విశేషం.
మెగా డాటర్ నిహారిక కేవలం నటి మాత్రమే కాదు.. నిర్మాతగా కూడా సక్సెస్ అయింది. చిన్న ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ సినిమాలను రూపొందిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తరచూ ఇండస్ట్రీలోని సున్నితమైన అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. ఈసారి ఆమె ప్రస్తావించిన విషయం కొత్తగా అడుగుపెడుతున్న యాక్టర్స్ భావాలను అచ్చుగా ప్రతిబింబించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నిహారిక కొణిదెల వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చకు కేంద్రంగా మారాయి. రాబోయే అవార్డు వేడుకల్లో నిర్వాహకులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా? కొత్త టాలెంట్‌కు మరింత గౌరవం దక్కుతుందా? అన్నది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











