మరో సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే?
సినీనటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ, సినిమాలు చేయనప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు.. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత సినీరంగానికి దూరంగా ఉన్న ఆమె కొద్దిరోజుల క్రితం రవితేజ సినిమాలో నటించారు. రెండేళ్ల గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ వివరాల్లోకి వెళితే..
పిల్లల కోసం కెరీర్ త్యాగం
పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాధ్యతలను తీసుకున్నారు రేణు. వారి కోసం ఆమె తన కెరీర్‌నే త్యాగం చేశారు. భారతీయ విలువలు, సాంప్రదాయాలతో వారిని పెంచి పెద్ద చేశారు. ప్రస్తుతం అకీరా నందన్‌ను లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు రేణు దేశాయ్. ఇప్పటికే కొడుక్కి యాక్టింగ్, ఇతర స్కిల్స్ నేర్పించారు. ఇక పియానో వాయించడంలో శిక్షణ తీసుకున్న అకీరా నందన్ ఇందులో మాస్టర్ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం తండ్రి వెంటే ఉంటున్న అకీరాను త్వరలోనే చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని మెగా కుటుంబం భావిస్తోంది.

ఎన్జీవోతో సమాజ సేవ
రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి కూడా గతంలో పలుమార్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే వీటినీ ఆమె ఖండించారు. సామాజికవేత్తగా, పర్యావేరణవేత్తగా, జంతు ప్రేమికురాలిగా సమాజానికి సేవలందిస్తున్నారు రేణు దేశాయ్. ఓ ఎన్జీవోను స్థాపించి మూగజీవాల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. తాను సాయం చేయడంతో పాటు పలువురి నుంచి విరాళాలు వసూలు చేస్తూ సేవలు అందిస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావుతో రీఎంట్రీ
దాదాపు 20 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో నటించి పవన్ అభిమానులను అలరించారు. సామాజికవేత్త హేమలతా లవణం పాత్రని ఆమె పోషించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ మాజీ భార్య కొత్తగా ఏ సినిమాకు ఓకె చెప్పలేదు. అయితే తమ సినిమాలలో నటించాలంటూ పలువురు ఒత్తిడి చేస్తున్నారని, ఎన్నో గొప్ప పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. అయితే ఓ సినిమాలో అత్తగారి రోల్‌లో నటించేందుకు ఓకే చేసినట్లుగా ఆమె గతంలో బయటపెట్టారు. కానీ అది ఏ సినిమా? హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? అనేది మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ ఊహాగానాలకు తెరపడ్డాయి.
కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్
పదహారు రోజుల పండుగ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో తాను నటిస్తున్నట్లు రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీఎస్ రావు తనయుడే సాయికృష్ణ. నితిన్ హీరోగా గతంలో వచ్చిన ద్రోణ సినిమాలో బాలనటుడిగా నటించిన సాయి.. ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్‌ను సైతం అందుకున్నారు. పదహారు రోజుల పండుగ సినిమాలో ఉద్యన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలకపాత్ర పోషించనున్నారు. స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో వేస్తున్నారు. సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు , ప్రతిభ నిర్మిస్తున్నారు. అనసూయ ఇతర చిత్ర బృందంతో రేణు దేశాయ్ దిగిన సెల్ఫీ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











