Pooja Hegde: అల వైకుంఠపురంలో తమిళ సినిమానా? త్రివిక్రమ్ తమిళ డైరెక్టరా? పూజా హెగ్డేపై నెటిజన్ల ఫైర్
సినిమా పరిశ్రమలో వరుస ఫ్లాపులతో కెరీర్‌ను కొనసాగిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నది. ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలను నెటిజన్ల తప్పుపడుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఏఎన్ఐ (ANI)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల వైకుంఠపురం సినిమాపై చేసిన కామెంట్స్‌పై తెలుగు ఆడియెన్స్ భగ్గుమంటున్నారు. ఇంతకు పూజా హెగ్డే ఏం మాట్లాడుతున్నారనే విషయంలోకి వెళితే..
పూజా హెగ్డే ఇటీవల నటించిన దేవా చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురి అవుతున్నది. షాహిద్ కపూర్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఆరంభంలో మోస్తారు కలెక్షన్లు సాధించినా.. తొలివారాంతం తర్వాత కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ విజయానికి దూరంగా ఉండటం గమనార్హం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏ సినిమాలో నటించామనే విషయం కూడా తెలియక అమాయకంగా మీడియాకు, నెటిజన్లకు దొరికిపోయారు.

తెలుగులో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్‌గా ప్రేక్షకులతో గుర్తింపు పొందారు. ఆమె నటించిన చిత్రాలు వరుసగా హిట్స్ సాధించడంతో ఆమె ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి హిందీ పరిశ్రమలోనే ఆమె కొనసాగుతున్నారు.
ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠపురంలో చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకొన్నాయి. అయితే తాజాగా ముంబైలో ఆమె మాట్లాడుతూ.. అల వైకుంఠపురంలో సినిమా తమిళ సినిమా. అది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. హిందీలో కూడా ప్రేక్షకులు భారీగా ఆదరించారు. అలాగే డీజే చిత్రం కూడా హిందీలో బాగా ఆడింది అని ఆమె చెప్పుకొంటూ వచ్చారు.
అయితే సినిమా ఏ భాషలో రూపొందిందనే విషయం కాకుండా కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యే కథ ఉంటే ఆ సినిమా విజయం సాధిస్తుంది అని బుట్ట బొమ్మ చెప్పారు. అయితే అల వైకుంఠపురంలో సినిమాను తమిళ మూవీగా చెప్పడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆమె నటించిన సినిమా ఏ భాషలో వచ్చిందనే విషయం తెలియదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
పూజాపై నెటిజన్లు కామెంట్ చేస్తూ.. రకరకాల భాషల్లో సినిమాలు చేస్తే కన్‌ఫ్యూజన్ ఇలానే ఉంటుందేమో.. ఇంకా కాస్త ఆగితే పుస్ప 2 మూవీ కూడా తమిళ సినిమా అంటుందేమో. టాలీవుడ్ అంటే తమిళ సినిమా అనుకొంటుందేమో.. త్రివిక్రమ్ కూడా తమిళ డైరెక్టర్ అనుకొంటుదేమో.. ఆమెను తీసుకెళ్లి తమిళ ఇండస్ట్రీలో పారేయాలి అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. దీనిపై పూజా హెగ్గే ఎలా స్పందిస్తుందే వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











