మళ్లీ బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్న బ్యూటీ ... వరుస ఆఫర్లు అందుకుంటోన్న పూజా
ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అంటారు. ఈ సంగతి మన హీరోయిన్లకు బాగా తెలుసు. ఇక చిన్న అవకాశం దొరికితే చాలు తీగలా దానికి అల్లుకుపోయే తెలివితేటలు మన క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డేకు కాస్త మెండుగానే ఉన్నాయని చెప్పాలి. ముందు నుంచి బాలీవుడ్ పైనే గురిపెట్టిన ఈ కుందనపు బొమ్మ, ఈసారి ఆ దిశగా గట్టిగానే స్కెచ్ వేస్తోందట.
తెలుగులో అప్పుడప్పుడే వడివడిగా ఆఫర్లు అందుకుంటోన్న పూజా హెగ్డే, అంతలోనే బాలీవుడ్ పై బోలెడు ఆశలతో రెక్కలు కట్టుకుని ఎరిపోయింది. హృతిక్ రోషన్ తో సినిమా అయ్యేసరికి ఇక అమ్మడు అక్కడే ఫిక్స్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, మహెంజొదారో సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. రెండేళ్లు అయ్యేసరికి తిరుగుటపాలో తెలుగుసీమకు వచ్చి చేరిన పూజా, ఇక అప్పటినుంచి రెట్టించిన గ్లామర్ తో టాలీవుడ్ వాసులను అలరిస్తూనే ఉంది. అయితే, అమ్మడి బాలీవుడ్ కల మాత్రం అలానే మిగిలిపోయింది.

తన కలలను పండించుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్న పూజా, చకచకా పావులు కదుపుతూ ఆఫర్లు మీద ఆఫర్లు పట్టేస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ రాథే శ్యామ్ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ సరసన ఓ ఆఫర్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఖభీ ఈద్ ఖభీ దివాలీ సినిమాలో అమ్మడు సల్మాన్ తో కలసి ఆడిపాడనుంది.
మరోవైపు అక్షయ్క కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా బచ్చన్ పాండే లోనూ పూజానే హీరోయిన్ గా కన్ఫామ్ చేశారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి సనన్ మెయిన్ హీరోయిన్ కాగా, పూజా క్యారెక్టర్ కూ చాలానే ప్రాముఖ్యత ఉందని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు గనుక బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంటే, బాలీవుడ్ లో అమ్మడు కుదురుకున్నట్లే లెక్క.


Click it and Unblock the Notifications











