‘ఆ తేడా ఎందుకు? హీరోల్లాగా మాకు ప్రాధాన్యత ఇవ్వరా?'
సినిమా ఇండస్ట్రీ మొదటి నుంచి హీరోకే ప్రాధాన్యత ఇవ్వడం, హీరోయిన్లకు పరిమిత స్థానం ఇవ్వడం ఒక అలవాటుగా మారిపోయింది. దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చాలా అరుదుగానే వస్తున్నాయి. హీరోల కోసం ప్రత్యేకంగా ఎలివేషన్ సీక్వెన్స్‌లు, పవర్ పుల్ రోల్స్ డిజైన్ చేయడం తరచూ కనిపిస్తాయి. కానీ హీరోయిన్లు మాత్రం ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలకే పరిమితం అవుతున్నాయని విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అసమానతపై టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్ చేసింది.
టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా పేరు అంటే ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 'ఊహలు గుసగుసలాడే'తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ, జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ, శ్రీనివాస కళ్యాణం వంటి అనేక చిత్రాల్లో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రాశి ఖన్నా నటనా ప్రతిభకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. స్టార్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంటుంది.

అయితే.. టాలెంట్ ఉన్నా సరైన బ్రేక్‌లు రాకపోతే ఇండస్ట్రీకి దూరమైంది రాశి ఖన్నా. దీంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసిన రాశి, అక్కడ బోల్డ్ రోల్స్ చేస్తూ తన విభిన్న కోణాన్ని చూపించింది. ఈ క్రమంలో 'యోధ', 'అరణ్మనై 4', 'ది సబర్మతి రిపోర్ట్'వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సరసన చేసిన 'తెలుసు కదా' మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా ఇండస్ట్రీలో కొనసాగుతున్న లింగ అసమానత పై షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోల ఆధిపత్యం, బాక్సాఫీస్ మార్కెట్, మహిళా నటీమణుల పట్ల వ్యవహరించే తీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి.రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ ఫిల్మీ ఇండస్ట్రీలో హీరోలు అందుకునే స్టార్డమ్ గురించీ, అదే సమయంలో హీరోయిన్లు ఎదుర్కోనే అసమానత గురించీ ఓపెన్ గా మాట్లాడింది.
" ఇండియాలో మనం హీరో వర్షిప్‌కు చాలా కాలంగా అలవాటుపడ్డాం. మేల్ యాక్టర్స్ మాత్రమే బిగ్ రిటర్న్స్ అందిస్తారు" అని చెప్పారు. హీరోల మార్కెట్ వాస్తవంగా ఎక్కువగా ఉండటం కారణంగా ఇలాంటి అభిప్రాయాలు రావడం సహజమేనని ఆమె అంగీకరించినా, అదే సమయంలో మరో కీలక అంశాన్ని కూడా రాశీ ప్రస్తావించారు. "ఒక నటుడి లేదా నటీమణి మార్కెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది. అది నిజం... ఇది జెండర్‌పై ఆధారపడదు. కానీ, సెట్స్‌పై మాత్రం మహిళలకు కూడా పురుషుల్లాగే సమాన గౌరవం రావాలి" అని రాశీ ఖన్నా స్పష్టం చేశారు.
ఇండస్ట్రీలో ఇంకా హీరోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని, హీరోయిన్లు ఎంత ప్రతిభావంతులైనా సరే వారు రెండో స్థానంలో పడిపోతున్నారని ఆమె తెలిపారు. సెట్స్ లో కూడా హీరోలకు, హీరోయిన్స్ కు లభించే ప్రవర్తన, సదుపాయాలు, గౌరవం విషయంలో ఎలాంటి తేడా ఉండకూడదని రాశీ అభిప్రాయపడ్డారు. రాశీ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్లలో చర్చనీయాంశమయ్యాయి. చాలామంది ఆమె మాటలకు మద్దతు తెలుపుతూ, మహిళా నటీమణులకు కూడా సమాన వాతావరణం కలగాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











