వినోదం పేరుతో హద్దులు దాటకండి.. బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
Radhika Apte: బాలీవుడ్ నటి రాధికా ఆప్టే గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాధిక, బాలీవుడ్‌లోనూ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బోల్డ్ పాత్రలు, ఓపెన్ అభిప్రాయాలతో తరచూ వార్తల్లో నిలిచే ఈ హీరోయిన్, తాజాగా భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో పెరుగుతున్న హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే..?
రాధికా ఆప్టే తొలుత మరాఠీ సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లిన ఆమె, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న రాధిక, రక్త చరిత్ర 2, లెజెండ్, లయన్, కబాలి వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి పేరు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

అయితే రాధికా ఆప్టే కెరీర్‌లో సినిమాల కంటే కూడా ఆమె చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా చర్చకు దారి తీస్తుంటాయి. ముఖ్యంగా పార్చ్డ్, ది వెడ్డింగ్ గెస్ట్ వంటి చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లో నటించడం, అలాగే మహిళలపై జరుగుతున్న వివక్ష, సినిమా సెట్లలో ఎదురయ్యే ఇబ్బందులపై బహిరంగంగా మాట్లాడటం వల్ల ఆమె తరచూ వివాదాల్లో నిలిచింది. గతంలో ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను గర్భవతిగా ఉన్నప్పటికీ నిర్మాతల నుంచి కనీస మానవత్వం లభించలేదని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి.
ఇప్పుడు తాజాగా ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి.భారతీయ సినిమాలు, సిరీస్‌లలో హింసను వినోదంగా చూపిస్తున్న తీరు తనను తీవ్రంగా కలిచివేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "కథ చెప్పాలంటే తప్పనిసరిగా రక్తపాతం, క్రూరత్వాన్ని అతిగా చూపించాల్సిన అవసరం లేదు. హింసే ఎంటర్టైన్‌మెంట్‌గా మారిన ఈ ప్రపంచంలో నా కూతుర్ని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. నిజంగా భయంగా ఉంది' అని రాధిక వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం సినిమాల్లో కథలో డెప్త్ కంటే.. తెరపై చూపించే హింసకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె విమర్శించారు. 'ఒక హంతకుడి కథ చెప్పాలంటే తలలు నరికే సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు చూపించాల్సిన అవసరం ఏముంది? అలాంటి సన్నివేశాలు సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అయినా జనాలు కూడా ఇలాంటి కంటెంట్‌ను ఆసక్తిగా చూడటం బాధ కలిగిస్తోంది' అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది.
ఇదే సమయంలో డబ్బుల కోసం హింసాత్మక పాత్రల్లో నటించేందుకు సిద్ధపడుతున్న నటీనటులపైనా రాధిక విమర్శలు గుప్పించింది. 'డబ్బులు ఉన్నాయిగా అని హింసను ప్రోత్సహించే క్యారెక్టర్లలో నటించాల్సిన అవసరం లేదు'అంటూ ముఖ్యంగా హీరోయిన్స్‌కు క్లాస్ పీకింది. అలాగే, రైటర్లపై కూడా వ్యాఖ్యానిస్తూ 'విజన్ ఉందంటారు. కానీ, దాన్ని పేపర్ మీద బలమైన కథగా రాయలేకపోతున్నారు' అని వ్యాఖ్యానించింది.


Click it and Unblock the Notifications











