‘అతనితో బిడ్డను కనాలని ఉంది.. 7 ఏళ్లుగా కష్టపడుతున్నా’
సృష్టిలో తీయనిది మాతృత్వం. పెళ్లయిన తర్వాత ప్రతి స్త్రీ తల్లిని కావాలని అనుకుంటుంది. మాతృత్వంతోనే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుందని భారతీయులు విశ్వసిస్తారు. అయితే ఇది అంత తేలిక కాదు.. గర్భదారణ నుంచి బిడ్డ పుట్టే వరకు ప్రతి స్త్రీ మూర్తి యుద్ధం చేస్తారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవ వేదన వరకు రోజుకొక అనుభువాన్ని పొందుతారు మహిళలు. కొందరికీ ఇది అందంగా ఉంటే.. మరికొందరికీ ఇది తీరని విషాదాన్ని మిగులుస్తుంది. తాజాగా తన మాతృత్వ అనుభవాలను పంచుకున్నారు ఓ స్టార్ హీరోయిన్.
ఆమె నటనకు 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
బాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు బెంగాలీ ముద్దుగుమ్మ రాణీ ముఖర్జీ. తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్ధుగుమ్మ.. 2000వ దశకంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. కెరీర్‌లో ఏకంగా 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందిన ఘనత రాణి సొంతం. నటిగా విజయవంతమైన కెరీర్ కొనసాగించిన రాణి ముఖర్జీ.. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమా బ్యాక్‌గ్రౌండ్
21 మార్చి 1978న ముంబైలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు రాణీ ముఖర్జీ. ఈమెది సినీ నేపథ్యమున్న కుటుంబమే.. రాణి తండ్రి రామ్ ముఖర్జీ ప్రఖ్యాత ఫిల్మాలయ స్టూడియోస్ వ్యవస్ధాపకుల్లో ఒకరు. తల్లి కృష్ణ ముఖర్జీ నేపథ్య గాయనీ. ఈమె అన్నయ్య రాజా ముఖర్జీ నిర్మాత, దర్శకుడు. అలాగే ప్రఖ్యాత హీరోయిన్స్ దేబాశ్రీ రాయ్, కాజోల్‌లు ఈమెకు బంధువులు. ఒడిస్సీ నృత్యం నేర్చుకున్న రాణీ ముఖర్జీ.. 1998లో అమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన గులామ్ సినిమాతో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత చల్తే చల్తే, హమ్ తుమ్ వీర్ జార, యువ, బ్లాక్, తలాష్, మర్దానీ, హిచికి తదితర సినిమాలతో రాణీ ముఖర్జీ బాలీవుడ్‌లో తిరుగులేని నటిగా నిలిచారు.
ఆదిత్య చోప్రాతో పెళ్లి
కెరీర్ పీక్స్‌లో ఉండగానే బాలీవుడ్ బడా నిర్మాత ఆదిత్య చోప్రాతో ప్రేమాయణం సాగించిన రాణీ ముఖర్జీ ఆయనను 2014లో బెంగాలీ సంప్రదాయంలో ఇటలీలో పెళ్లాడారు. ఈ దంపతులకు కుమార్తె అధిర సంతానం. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ రాణీ ముఖర్జీ చురుగ్గా పాల్గొంటున్నారు. బాలల హక్కుల కోసం పాటుపడే సంస్థలకు సాయం చేస్తున్నారు. అలాగే 2004లో హిందూ మహాసముద్రంలో సునామీ విరుచుకుపడినప్పుడు కన్సర్ట్ నిర్వహించి వచ్చిన డబ్బును బాధితులకు అందజేశారు. అలాగే పెటా ఇండియా, స్వచ్ఛ్ భారత్, అమితాబ్ బచ్చన్ ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటున్నారు.
జీవితంలో అదే లోటు
జీవితంలో ఇన్ని విజయాలు సాధించినా రాణీ ముఖర్జీకి ఓ లోటు ఉందట. అదే రెండో సంతానం. ఆమెకు కుమార్తె అధిర ఉన్నప్పటికీ రెండో బిడ్డ కోసం రాణీ ముఖర్జీ ఎన్నో కలలు కన్నారట. ఈ విషయాన్ని ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా బయటపెట్టారు. దాదాపు ఏడేళ్లుగా తాను, తన భర్త రెండో సంతానం కోసం ప్రయత్నిస్తున్నామని రాణీ ముఖర్జీ తెలిపారు. ఓసారి గర్భం దాల్చానని.. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదని, కడుపులోనే గర్భస్రావం కావడంతో రెండో బిడ్డను కోల్పోయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తనకు 46 ఏళ్లని .. ఈ వయసులో రెండో బిడ్డను కనే స్థితిలో లేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు చెల్లిని కానీ, కానీ తమ్ముడిని కానీ ఇవ్వలేకపోయాననే బాధ వెంటాడుతోందని రాణీ ముఖర్జీ తెలిపారు. భగవంతుడు ఇచ్చినది చాలని అధిరని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.


Click it and Unblock the Notifications











